National

PNB Scam: పీఎన్‌బీలో రూ.35 కోట్ల స్కామ్.. మేనేజర్‌తో సహా ఐదుగురు ఉద్యోగులు సస్పెండ్!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

PNB Scam: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లో వెలుగు చూసిన రూ.35 కోట్ల స్కామ్ తీవ్ర దుమారం రేపింది. ఖాతాదారుల పర్మిషన్ లేకుండానే కోట్ల రూపాయల డిపాజిట్లు పక్కదారి పట్టినట్లు తేలడంతో బ్యాంకు యాజమాన్యం తక్షణ చర్యలకు ఆదేశించింది.

PNB Scam: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లో వెలుగు చూసిన రూ.35 కోట్ల స్కామ్ తీవ్ర దుమారం రేపింది. ఖాతాదారుల పర్మిషన్ లేకుండానే కోట్ల రూపాయల డిపాజిట్లు పక్కదారి పట్టినట్లు తేలడంతో బ్యాంకు యాజమాన్యం తక్షణ చర్యలకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ అనంతరం బాధ్యులుగా తేలిన బ్రాంచ్ మేనేజర్‌తో సహా మొత్తం ఐదుగురు ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

బ్రాంచ్ మేనేజర్ పాత్రపై ..

ఖాతాదారుల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్ల నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే రూ.35 కోట్లు మాయమైన వ్యవహారం బయటకు రాగానే పీఎన్‌బీ ఉన్నతాధికారులు, విజిలెన్స్ బృందాలు సదరు బ్రాంచ్‌పై దృష్టి సారించాయి. అంతర్గత తనిఖీల్లో బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. మేనేజర్‌తో పాటు మరో నలుగురు సిబ్బందిపై వేటు వేశారు. బ్యాంకు కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా తక్షణమే ఆ బ్రాంచ్‌కు కొత్త సిబ్బందిని కేటాయించారు. మరోవైపు బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిధుల దారిమళ్లింపు వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

రూ.80 లక్షల వరకు ఎఫ్‌డీలు మాయం..

కష్టపడి దాచుకున్న సొమ్ముకు రక్షణ కల్పించాల్సిన బ్యాంకు అధికారులే ఈ మోసానికి తెరలేపారన్న వార్తలతో ఖాతాదారులు ఆగ్రహంతో ఊగిపోయారు. కస్టమర్ల అనుమతి లేకుండానే ఎఫ్‌డీలను రద్దు చేసి, నిధులను ఇతర ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించిన బాధితులు బ్యాంకు ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. పలువురి ఖాతాల నుంచి రూ.10 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు డిపాజిట్లు కనిపించకుండా పోయాయని ఆరోపించారు. ఈ పరిణామాలపై స్పందించిన పీఎన్‌బీ యాజమాన్యం.. కస్టమర్ల డిపాజిట్లకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేసింది. చట్టపరమైన దర్యాప్తు పూర్తయిన తర్వాత బాధితుల సొమ్మును నయాపైసాతో సహా తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఒక ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్ స్థాయి వ్యక్తే ఇలాంటి భారీ కుంభకోణానికి పాల్పడటం బ్యాంకింగ్ వ్యవస్థలోని డిజిటల్ సెక్యూరిటీ, అంతర్గత ఆడిట్ డొల్లతనాన్ని బట్టబయలు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

#PNB Scam#Punjab National Bank#PNB Bank Scam#PNB Fraud Case#Rs 35 Crore Bank Scam#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి