తెలంగాణ

ఇందిరమ్మ పాలన అంటే.. ఆనాటి ఎమర్జెన్సీ రోజులే- సీఎం రేవంత్ పై కేటీఆర్, హరీశ్ రావు ఫైర్

రచన: NK•••4 నిమిషాల పఠనం

రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు. మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్, హరీశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Brs: రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు. మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్, హరీశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తో పాటు కార్తీక్ రెడ్డిని అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు.

రేవంత్ కి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు

ఇందిరమ్మ పాలన అంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులే అని మరోసారి గుర్తు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ కి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ గొంతు నొక్కే ఇలాంటి కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదన్నారు. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువు విలయతాండవం చేస్తుంటే లక్షన్నర కోట్ల రూపాయల లూటిఫికేషన్ కు సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేయడం సిగ్గు చేటన్నారు.

ఎమర్జెన్సీ తరహా పాలన

బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు మాజీమంత్రి హరీష్ రావు. ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నారని వాపోయారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరుతో లక్ష 50 వేల కోట్లు ఖర్చు చేస్తామనడం దారుణం అన్నారు. కాంగ్రెస్ కు కమీషన్లు దండుకోవడంపై ఉన్న శ్రద్ధ.. కరువు బాధిత రైతులను ఆదుకోవడంలో లేదన్నారు. ఓవైపు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ మరోవైపు పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాల గొంతు ఎంతకాలం నొక్కుతారు? ఎన్ని రోజులు అణిచివేస్తారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు హరీష్ రావు.

లక్షన్నర కోట్ల లూటీకి సీఎం స్కెచ్

''లక్షలాది మంది రైతులు కరువులో మునిగి కన్నీళ్లు పెట్టుకుంటుంటే సీఎం రేవంత్ మాత్రం మూసీలో మూటల వేట సాగిస్తున్నారు. కరువు పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో లక్షన్నర కోట్ల లూటీకి సీఎం రేవంత్ స్కెచ్ వేయడం ఏంటి? మూసీ బ్యూటిఫికేషన్ ముసుగులో లక్షల కుటుంబాల ఇల్లు కూల్చి రియల్ ఎస్టేట్ దందా చేయాలనే రేవంత్ పన్నాగాన్ని అడ్డుకునే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది.

అప్రజాస్వామికంగా హౌస్ అరెస్ట్ చేసిన తమ పార్టీ నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో జరుగుతున్న లూటిఫికేషన్ ప్రయత్నాలను తిప్పికొడతాం'' అని హరీశ్ రావు అన్నారు.

#Brs#Telangana Politics#Ktr#Harish Rao#Musi Beautification#Swechaa News#Musi Project Hearing
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి