తెలంగాణ

హైదరాబాద్‌లో తాగునీటి స‌మ‌స్య రాకూడ‌దు- సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రచన: NK•••5 నిమిషాల పఠనం

రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

* క్యూర్ ఏరియాలో ఎస్టీపీలు వంద శాతం పని చేయాలి

* భవన నిర్మాణాల్లో శుద్ది చేసిన నీరు వినియోగించాలి

* తాగు నీరు స‌ర‌ఫ‌రా, ఎస్టీపీలపై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

Cm Revanth: రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగు నీటి స‌ర‌ఫ‌రా విష‌యంలో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. రిజ‌ర్వాయ‌ర్లలో నీటి నిల్వ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ ఉండాల‌న్నారు. క్యూర్ ఏరియాలో మంచి నీటి స‌ర‌ఫ‌రా, ఎస్టీపీల నిర్మాణం, ట్రీటెడ్ వాట‌ర్ వినియోగంపై ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధి పెవిలియ‌న్ లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు.

శుద్ధి చేసిన నీటినే వాడాలి

ఎల్ నినో నేప‌థ్యంలో భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని క్యూర్ ఏరియాలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) వంద శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాల‌ని సీఎం ఆదేశించారు. శుద్ధి చేసిన నీటిని సెక్ర‌టేరియ‌ట్ తో పాటు సీఎంవో, ఔటర్ రింగ్, మైట్రో రైల్, ఇత‌ర శాఖ‌ల‌ కార్యాల‌యాల్లో పచ్చదనం నిర్వహణ, ఇత‌ర అవ‌స‌రాల‌కు వినియోగించేలా చూడాల‌ని చెప్పారు.

పార్కులు, రోడ్ల శుభ్రత, భ‌వ‌న నిర్మాణలకు ఆ నీరే..

ప‌బ్లిక్ పార్కులు, రోడ్ల శుభ్ర‌తకు కూడా ట్రీటెడ్ వాట‌ర్ నే వాడాల‌న్నారు. భ‌వ‌న నిర్మాణంలో శుద్ది చేసిన నీటినే వాడాల‌నే నిబంధ‌న‌ను క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్రైవేట్ ఎస్టీపీల ఏర్పాటును ప్రోత్సహించాలని, డేటా సెంటర్లకూ శుద్ధి చేసిన నీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌న్నారు. ఎస్టీపీల నిర్వహణకు సోలార్ విద్యుత్‌ను వినియోగించే అవకాశాలను ప‌రిశీలించాల‌ని రెడ్కో ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్.

నీటి నాణ్యత విష‌యంలో రాజీపడొద్దు

ఎస్టీపీల్లో నీటి శుద్ధికి అత్యాధునిక సాంకేతిక ప్ర‌మాణాలు పాటించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ స్ప‌ష్టం చేశారు. నీటి నాణ్యత విష‌యంలో ఏ మాత్రం రాజీ ప‌డొద‌న్నారు. ప్రతి శుద్ధి కేంద్రం వద్ద ప్రత్యేక అధికారిని నియమించాలని, అన్ని ప్లాంట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కేంద్రాల పనితీరును ఎప్ప‌టికిప్పుడు హైడ్రా పర్యవేక్షించాల‌న్నారు.

ట్రీటెడ్ వాటర్ కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్

ట్రీటెడ్ వాటర్ సరఫరా చేసే ట్యాంకర్లను ట్రాక్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఈ నీటి వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ట్రీటెడ్ వాటర్ కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్టీపీల నిర్వహణ, ట్రీటెడ్ వాటర్ వినియోగానికి సంబంధించి నవంబర్ 1 నుంచి ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు సీఎం రేవంత్.

ప్ర‌స్తుతం 26 ఎస్టీపీల్లో ట్రీటెడ్ వాట‌ర్ ను గ్రీన్ ట్యాంక‌ర్స్ ద్వారా పంపిణీ చేస్తున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు ముఖ్య‌మంత్రికి తెలిపారు. వినియోగ‌దారుల నుంచి కేవ‌లం ర‌వాణా రుసుం మాత్ర‌మే వ‌సూలు చేస్తున్నామ‌ని, నీళ్లను ఉచితంగా అందిస్తున్న‌ట్లు వివరించారు.

#Cm Revanth Reddy#Telangana#Hyderabad#Drinking Water#Treated Water#STPP#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి