Elnino: ఎల్ నినో పరిస్థితుల కారణంగా తెలంగాణ మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కరువును కొన్ని మండలాలకే పరిమితం చేయడం కరెక్ట్ కాదన్నారు. క్షేత్రస్థాయిలో కరువు పరిస్థితిని పరిశీలించేందుకు నవంబర్ 3,4 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో పర్యటిస్తామన్నారు. అదే సమయంలో రాజకీయ పార్టీలకు హితబోధ చేశారు కూనంనేని సాంబశివరావు.
ఎల్ నినో పరిస్థితులతో కరువు విలయ తాండవం చేస్తోందన్నారు. కరువు అనేది ప్రపంచవ్యాప్తంగా సంభవించిందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంపై రాజకీయంగా ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడం మాని.. ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో ఆలోచన చేయాలని రాజకీయ పార్టీలకు సూచించారు.
కరువు విలయతాండవం మొదలైంది
''ఎల్ నినో ప్రభావంతో కరువు విలయతాండవం మొదలైంది. ఇది సంవత్సర కాలం పాటు ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మనం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మా జనరేషన్ కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదు. అప్పుడెప్పుడో బెంగాల్ లో డొక్కల కరువు వచ్చింది. అటువంటి పరిస్థితి మళ్లీ వస్తోంది.
బురద రాజకీయాలు మానండి
రాజకీయంగా ఒకరిపై మరొకరు బురద చల్లుకునే కార్యక్రమాలు పక్కన పెట్టి దీని నుంచి ఎలా బయటపడాలనేది చూడాలి. ప్రభుత్వ లెక్క ప్రకారమే ఒక హైదరాబాద్, ఇంకొక రెండు జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులు వచ్చాయి. 300కు పైగా కరువు మండలాలు అని ప్రకటన చేశారు. కొన్ని మండలాలకే పరిమితం చేయకూడదు. కరువు దేశవ్యాప్తంగా వచ్చింది. ఒక ప్రాంతం వారికి ఈ కరువు పరిమితం కాదు. ఒక ప్రాంతం ప్రభావం అన్ని ప్రాంతాలపై పడుతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించాలి. కరువు ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. మన డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా కరువు రాష్ట్రంగా డిక్లేర్ చేయాలి.
కరువు దాడులు చేస్తామని వార్నింగ్
ఇటువంటి పరిస్థితుల్లో బ్లాక్ చేయడం ద్వారా నిత్యవసర వస్తువుల ధరలను పెంచేస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైన ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇస్తే.. కేంద్రం తన బాధ్యత తాను నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా అక్రమంగా నిల్వ చేస్తే సీపీఐ కరువు దాడులు చేస్తోంది. పేద ప్రజలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తుంది. కరువు దాడులు ఖచ్చితంగా చేస్తాం. ఎక్కడైనా బ్లాక్ చేసినా, హోర్డింగ్స్ చేసినా వాటిని నిర్మొహమాటంగా పేదలకు పంచి పెడతాం. లేదా గవర్నమెంట్ ద్వారా అయినా పేదలకు పంచుతాం'' అని కూనంనేని సాంబశివరావు అన్నారు.


