DPDP Act: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) యాక్ట్-2023 నిబంధనలు స్వతంత్ర జర్నలిజం ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయనే ఆందోళన దేశ సర్వోన్నత న్యాయస్థానం మెట్లెక్కింది. వార్త రాయాలన్నా, పరిశోధనాత్మక కథనాలు ప్రచురించాలన్నా సదరు వ్యక్తుల ముందస్తు అనుమతి (కన్సెంట్) తప్పనిసరి అయితే దేశంలో పత్రికా రంగమే నిర్వీర్యమవుతుందని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన త్రిసభ్య ధర్మాసనం, దీనిపై పూర్తి వివరాలు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి అధికారిక నోటీసులు జారీ చేసింది.
న్యూస్‌రూమ్‌లను మూసివేసే ముప్పు
ఈ చట్టంలోని కొన్ని రూల్స్ వాస్తవ విలేకరితనానికి సంకెళ్లు వేసేలా ఉన్నాయని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ ధర్మాసనం ఎదుట బలంగా వాదించారు. ప్రతి వార్త వెనుక సమాచారం ప్రచురించేందుకు వ్యక్తుల ముందస్తు అనుమతి తీసుకోవాల్సి రావడం పరోక్షంగా "ముందస్తు సెన్సార్షిప్" కిందకే వస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల స్కామ్‌లను వెలికితీసే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందన్నారు. అలాగే సంఘటనా స్థలం నుంచి క్షణక్షణ సమాచారాన్ని అందించే లైవ్ రిపోర్టింగ్ చేయడం అసాధ్యంగా మారుతుందని చెప్పారు. చట్టం తెచ్చిన కొత్త నిబంధనల భయంతో దేశంలో న్యూస్‌రూమ్‌లను శాశ్వతంగా మూసివేసే దారుణ పరిస్థితులు దాపురిస్తాయని వివరించారు.
గోప్యత vs పత్రికా స్వేచ్ఛ
ఈ వివాదంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అత్యంత కీలకమైన పరిశీలనలు చేశారు. ప్రజాస్వామ్యంలో పౌరుల వ్యక్తిగత గోప్యతా హక్కు ఎంత విలువైందో, పత్రికా స్వేచ్ఛ కూడా అంతే కీలకమని పేర్కొన్నారు. ఈ రెండింటి నడుమ కచ్చితమైన సమతుల్యత అవసరమని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఈ చట్టం దుర్వినియోగం కాకుండా ఎలాంటి భద్రతా రక్షణలు కల్పించాలో ఇతర వ్యవస్థల కంటే మీడియా రంగ నిపుణులే అత్యంత సమర్థవంతంగా సూచించగలరని ధర్మాసనం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ స్పందనను కోరుతూ నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు, ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది. డిజిటల్ యుగంలో భావ ప్రకటన స్వేచ్ఛకు, వ్యక్తిగత డేటా రక్షణ చట్టానికి మధ్య జరుగుతున్న ఈ న్యాయపోరాటంలో సుప్రీం కోర్టు ఎలాంటి తుది తీర్పునిస్తుందనేది భారత మీడియా రంగ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారింది.


