Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రీషెడ్యూల్ అయ్యాయి. ఈ మేరకు ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. 7న ఫలితాలు వెల్లడిస్తారు. అవసరమైన చోట నవంబర్ 6న రీపోలింగ్ కు అవకాశం కల్పిస్తారు. నవంబర్ 3న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ కారణంగా నవంబర్ 3న జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు. నవంబర్ 5న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3నే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఆ రోజున మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో ఎన్నికలను రీషెడ్యూల్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. 7వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు. అదే రోజు పూర్తి చేసి ఫలితాలు కూడా వెలువరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీల విషయంలో ఉన్నటువంటి ఉత్కంఠకు తెరపడినట్లు చెప్పొచ్చు.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ లో మార్పులు కారణంగా పరిషత్ ఎన్నికల షెడ్యూల్ లోనూ మార్పులు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. షెడ్యూల్ ప్రకారం.. మున్సిపల్ ఎన్నికలు అక్టోబర్ 28వ తేదీనే జరగాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల షెడ్యూల్ లో మార్పులు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. 3న కౌంటింగ్ ఉంటుంది. అదే రోజున పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహిస్తే భద్రత కష్టంగా మారుతుందన్న పోలీసు శాఖ విజ్ఞప్తితో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రీషెడ్యూల్ చేసింది.


