Tech Layoffs: ఒకప్పుడు లక్షల్లో జీతాలు, విలాసవంతమైన జీవితం, చేతినిండా ప్రాజెక్టులతో కళకళలాడిన ఐటీ పరిశ్రమలో ఇప్పుడు గంభీరమైన నిశ్శబ్దం ఆవరించింది. పదేళ్ల క్రితం ‘సాఫ్ట్వేర్ ఇంజినీర్’ అంటే అదొక తిరుగులేని భరోసా. కానీ, నేడు ఆ భరోసాను ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ తీవ్రంగా ప్రశ్నిస్తోంది. అంతర్జాతీయంగా మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, డెల్ వంటి దిగ్గజ కంపెనీల నుంచి మొదలుకొని దేశీయ ఐటీ టాప్ కంపెనీలు టీసీఎస్, టెక్ మహీంద్రా వరకు దాదాపు అన్ని సంస్థల్లో తెరవెనుక ఒకటే చర్చ నడుస్తోంది.. అదే ‘కాస్ట్ కటింగ్’, వర్క్‌ఫోర్స్ రీ-స్ట్రక్చరింగ్. సాధారణంగా జరిగే లేఆఫ్‌ల లాగా కాకుండా, అత్యంత వ్యూహాత్మకంగా సాగుతున్న ఈ అంతర్గత ప్రక్షాళన వెనుక అసలేం జరుగుతోందో తెలుసుకుందాం.
కనుమరుగవుతున్న రోల్స్..
ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌నే ఉదాహరణగా తీసుకుంటే.. గతంలో కోర్ ప్రాజెక్టులుగా ఉన్న విండోస్, ఎక్స్‌బాక్స్, సాంప్రదాయ ఫైనాన్స్, సాధారణ హెచ్ఆర్ విభాగాల కంటే ఇప్పుడు పూర్తిగా ‘కోర్ ఏఐ’, గ్లోబల్ డేటా ఇంజినీరింగ్‌కే ఎక్కువ ప్రీయార్టి దక్కుతోంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, గురుగ్రామ్, పుణె, ముంబై వంటి ప్రధాన నగరాల్లోని టెక్ క్యాంపస్‌లలో ప్రస్తుతం అంతర్గత గ్రేడింగ్ విధానాలను అనూహ్యంగా కఠినతరం చేశారు. ఉద్యోగుల పనితీరును సరికొత్త ఏఐ ప్రమాణాలతో పోల్చి చూస్తూ, సంస్థలకు భారంగా మారిన విభాగాలను నెమ్మదిగా కట్ చేస్తున్నారు.
ఎగ్జిట్ ప్యాకేజీల వెనుక దాగున్న చేదు నిజం
ఈ ఏఐ తుఫానులో ప్రధానంగా దెబ్బతింటున్నది సాంప్రదాయ కోడింగ్, మాన్యువల్ టెస్టింగ్, సాధారణ డేటా ప్రాసెసింగ్ విభాగాలే. ఆటోమేషన్ ద్వారా నిమిషాల్లో పూర్తవుతున్న పనుల కోసం వేలమంది ఇంజినీర్లను పోషించడం సంస్థలకు భారంగా మారుతోంది. దీంతో పెద్దఎత్తున గందరగోళం చెలరేగకుండా సంస్థలు ‘రిస్క్ మేనేజ్మెంట్’ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. ప్రభావితమయ్యే ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ కొనసాగింపు, స్టాక్ ఆప్షన్స్, ఆకర్షణీయమైన ఎగ్జిట్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ బయటకు పంపే ప్రక్రియను వేగవంతం చేశాయి.
అప్ స్కిల్లింగ్ లేకపోతే ఔటేనా?
ఈ పెనుమార్పులు భవిష్యత్ ఐటీ రూపురేఖలను శాసిస్తున్నాయి. నాస్కామ్ (NASSCOM) వంటి పరిశ్రమల సమాఖ్యలు సైతం ఇదే హెచ్చరికను జారీ చేస్తున్నాయి. పాత తరం ప్రోగ్రామింగ్ నైపుణ్యాలతో ఇకపై నెట్టుకురావడం అసాధ్యం. మెషిన్ లెర్నింగ్, ఏఐ టూల్స్ వినియోగం, క్లౌడ్ డేటా అనలిటిక్స్ వంటి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు ఒంటపట్టించుకోకపోతే.. ఉద్యోగ భద్రత అనేది కలగానే మిగిలిపోతుందనేది చేదు వాస్తవం.


