హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్సై విజయ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్లాట్ల అమ్మకాల పేరుతో మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఫార్చ్యూన్ 99 హోమ్స్ అధినేత రోసిరెడ్డిని.. ఎస్ఐ విజయ్ రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే లంచం ఇవ్వాల్సిందేనని బ్లాక్ మెయిల్ చేశాడు.
అయితే, తాను రూ.10వేల కంటే ఎక్కువ ఇవ్వలేనని రోసిరెడ్డి చెప్పాడు. దీంతో పాత కేసుల్లో నోటీసు పేరుతో పిలిపించి లక్ష ఇవ్వాలంటూ విజయ్ డిమాండ్ చేశాడు. ఎస్ఐ వేధింపులు భరించలేకపోయిన రోసిరెడ్డి.. ఏసీబీని ఆశ్రయించాడు. ఎస్ఐ విజయ్ కి రోసిరెడ్డి లక్ష రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విజయ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
లంచం డిమాండ్ చేసిన కేసులో ఎస్ఐ అరెస్ట్ కావడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. కీలకమైన వివరాలు సేకరించారు. ఈ అవినీతి వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు.


