ఒక నాయకుడు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని హామీ ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చాడనే ఆరోపణలున్నాయి.. మరో నాయకుడు ఆ అప్పులు తీర్చడానికి దోచుకున్న సొమ్ము అంతాకక్కించి రాష్ట్రానికి ఉన్న అప్పులు తగ్గిస్తానని, రాష్ట్ర ప్రజల బ్రతుకులను మారుస్తా అని ప్రజలే దేవుళ్ళు అంటూ అధికారం పొందారు.. కానీ పాలకులు మారిన రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల జీవితాలు మారలేదు సరికదా.. పరిస్థితులు ఇంకా అధ్వానంగా మారడమే కాకుండా.. ప్రస్తుత ప్రభుత్వం దోపిడి గత ప్రభుత్వం దోపిడిని మించిపోయిందనే విమర్శలు ఎదురవడం కనిపిస్తుంది.
ఇక రాజకీయ నేతల ఆస్తులు అయితే చీమల పుట్టాలా పెరిగిపోతున్నాయనే ఆరోపణలున్నాయి.. ఈ వివాదాలు ఇలాగే కొనసాగుతుండగా.. ప్రస్తుతం ప్రకృతి ప్రకోపించడంతో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయి.. ఫలితంగా రైతులకు సరైన కరెంటు, పొలాలకు సాగునీరు అందకపోవడం వంటి ఘటనలు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం సాగునీరు, విద్యుత్ సరఫరా, తగ్గుతున్న నీటి నిల్వలు.. ఇవన్నీ కలిపి పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 24 నివేదిక ప్రకారం, ప్రభుత్వం 358 మండలాలను ప్రాథమికంగా కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు నీళ్లు సకాలంలో అందకపోతే పంటలు ఎండిపోతాయి. పెట్టుబడి పెట్టిన రైతుకు నష్టం వస్తుంది. అప్పులు తీర్చడం కష్టమవుతుంది. వ్యవసాయ కూలీలకు పనులు తగ్గుతాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పలు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయని అంటున్నారు.
మొత్తానికి కరువు ప్రభావం రైతుపై తీవ్రంగా పడటమే కాదు.. వ్యవసాయ కూలీ నుంచి చిన్న వ్యాపారి వరకు దాని ప్రభావం కనిపిస్తుంది. ఈ సమస్య ప్రభుత్వానికి కూడా సవాల్ గా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు.. ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు.. ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇప్పుడు ప్రధాన అంశాలుగా మారనున్నాయి.. ఎల్ నినో గురించి వాతావరణ శాస్త్ర వేత్తలు గత కొద్ది నెలల నుండి హెచ్చరిస్తున్నా.. తీరా సమస్య ముదిరాక హడావుడి చేయడం ముందుచూపు లేని తనంగా.. ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి నిదర్శనంగా విమర్శలు వస్తున్నాయి..
మరోవైపు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ కూడా ఇదే. గోదావరి, కృష్ణా నదుల్లో అందుబాటులోకి వచ్చిన నీటిని సరిగ్గా వినియోగించుకోలేదని, ప్రాజెక్టులను సకాలంలో నడిపి ఉంటే రైతులకు మరింత ప్రయోజనం కలిగేదని వారు అంటున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం కన్నెపల్లి పంప్‌హౌస్, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు..
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం, రిజర్వాయర్లలో తగ్గుతున్న నీటి నిల్వలు వంటి సమస్యలను ప్రస్తావిస్తోంది. రైతులకు విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కరువు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వివిధ శాఖలను అప్రమత్తం చేసి చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
కానీ ప్రతిపక్షం మాత్రం చర్యలు సరిపోవడం లేదని ఆరోపిస్తోంది. ఒకవేళ రాబోయే రోజుల్లో కరువు తీవ్రత మరింత పెరిగితే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఉన్న ప్రణాళికలు ఏంటని ప్రశ్నిస్తుంది. ఇక ఒక రైతు పంట నష్టపోతే ముందుగా స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తాడు. తన నియోజకవర్గంలో సాగునీటి సమస్య ఎందుకు పరిష్కారం కాలేదని నిలదీస్తాడు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే అధికారులను, ప్రజాప్రతినిధులను సమాధానం అడుగుతాడు.
అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజలకు ఏం సమాధానం చెబుతారన్నది ప్రస్తుతం కీలకంగా మారుతుంది. ఇప్పటికే రైతుల్లో అసంతృప్తి నెలకొందనే ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తిన ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే, ఆ అసంతృప్తి ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడిగా మారే అవకాశం ఉంటుందని విశ్లేషణలు చెబుతున్నాయి..
అలాగే అందుబాటులో ఉన్న నీటిని నిల్వ చేసుకోవడం, అవసరమైన ప్రాంతాలకు తరలించడం, అంతర్రాష్ట్ర నీటి పంపకాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం.. ఇవన్నీ ప్రభుత్వ బాధ్యతల్లో భాగమే.. అయితే నీటి వాటాల విషయంలో ఇప్పటివరకు లెక్కలు తేలలేదు.. ఫలితంగా అంతర్గతంగా వాదనలు జరుగుతున్నా ప్రయోజనం మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలున్నాయి..
మరోవైపు ప్రభుత్వం నీటిని సరిగ్గా వినియోగించలేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం గత ప్రభుత్వ హయాంలోని ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని.. అప్పుడు తలెత్తిన సమస్యలను ప్రస్తావిస్తున్నారు. కానీ ప్రజలకు కావాల్సింది గత ప్రభుత్వంపై విమర్శలు మాత్రమే కాదు. ప్రస్తుత ప్రభుత్వం రాబోయే నెలల్లో తాగునీటి అవసరాలను ఎలా తీర్చబోతోందనే దానికి సమాధానం..
అలాగే రైతులకు ఎంత నీరు అందుబాటులో ఉంది? విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఏ చర్యలు తీసుకుంటోంది? పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటోందనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు కావాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. ఎందుకంటే కరువు తీవ్రత పెరిగితే దాని ప్రభావం వ్యవసాయంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుంది. ఆ సమయంలో ప్రజలకు అండగా నిలబడటం, నష్టాన్ని తగ్గించడం ప్రభుత్వ బాధ్యత..
మరోవైపు తెలంగాణలో కరువు పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ సవాలుగా మారుతున్నాయి.. ప్రభుత్వం సకాలంలో సమస్యలను పరిష్కరించి రైతులకు అండగా నిలబడితే ప్రభుత్వం పై వచ్చే విమర్శలు కొంతవరకైనా తగ్గే అవకాశాలుంటాయని, సమస్యలు అలాగే కొనసాగి ప్రజలకు నష్టం పెరిగితే పరిస్థితి మరోలా ఉండే అవకాశలున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.. కానీ కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోతే ప్రజల ఆగ్రహానికి గురి అవ్వవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చని అంటున్నారు.
అదీగాక ఈ సమస్యను క్షేత్ర స్థాయిలో బలంగా వినిపిస్తే బీఆర్ఎస్ కు సానుకూలంగా మారే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు.. ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ వైఫ్యల్యాలనే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి విజయాన్ని సాధించారు.. కాబట్టి ఈ అంశం ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కలిసివచ్చే కాలంగా చెబుతున్నారు.. ఇక కరువు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ సంక్షోభంగా మారుతుందా? లేక సమర్థమైన నిర్వహణతో రేవంత్ సర్కార్ ఈ సవాలును ఎదుర్కొంటుందా? అనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది...


