స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

సంచలనంగా స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ కథనం

రచన: Swechaanews Chairman7 నిమిషాల పఠనం

‘‘పెద్దిపై ప్రెజర్ పెట్టింది ఎవరు?’’ అంటూ బుధవారం(జూలై 29) స్వేచ్ఛ చైర్మన్ దేవేందర్ రెడ్డి రాసిన ఇన్వెస్టిగేషన్ కథనం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కథనంపై గురువారం బీఆర్ఎస్ స్పందించింది.

  • ‘‘పెద్దిపై ప్రెజర్ చేసింది ఎవరు’’ కథనానికి బీఆర్ఎస్ స్పందన

  • స్వేచ్ఛలో వచ్చిన వార్తను చూపిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్

  • పూర్తిస్థాయి దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్

  • పెద్దికి స్క్రోక్ రావడానికి ఆర్థిక లావాదేవీలు, రాజకీయ ఒత్తిళ్లే కారణం అని ఆరోపణ

  • స్వేచ్ఛ ఇన్వెస్టిగేటివ్ కథనానికి విశేష స్పందన

‘‘పెద్దిపై ప్రెజర్ పెట్టింది ఎవరు?’’ అంటూ బుధవారం(జూలై 29) స్వేచ్ఛ చైర్మన్ దేవేందర్ రెడ్డి రాసిన ఇన్వెస్టిగేషన్ కథనం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కథనంపై గురువారం బీఆర్ఎస్ స్పందించింది. స్వేచ్ఛ వార్తలో చెప్పినట్లుగానే బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై రాజకీయ ఒత్తిళ్లు నిజమే అని ఆపార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. స్వేచ్ఛ కథనంలో చెప్పినట్లుగానే పెద్దిపై రాజకీయ ఒత్తిళ్లు నిజమేనని వెల్లడించారు. ఎలాంటి చెడు అలవాట్లు లేకున్నా పెద్దికి స్ట్రోక్ రావడానికి రాజకీయ ఒత్తిళ్లు, ఆర్థిక లావాదేవీలే కారణం అని ఆర్ఎస్ ప్రవీణ్ సైతం ఆరోపించారు. గన్ లైసెన్స్‌తో పాటు రక్షణగా ఉండే గన్ మెన్స్‌ను తొలగించడం కూడా ఆయనన ఒత్తిడికి గురి చేసిందని, మానసికంగా ఇబ్బంది పెట్టిందని అన్నారు.

స్వేచ్ఛలో వచ్చింది నిజమే..

‘‘పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అసలు ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అయినా గుండెపోటు రావడం అందరినీ షాక్‌కు గురి చేసింది’’ అని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపులే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడానికి కారణమన్నారు. స్వేచ్ఛ చైర్మన్ దేవేందర్ రెడ్డి కథనంలో రాసినట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడి ప్రమేయంతో ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని వెల్లడించారు. నర్సంపేటలో కొంతమంది వ్యాపారులు భూములు విక్రయించిన వ్యవహారంలో సీఎం సన్నిహితుడు ఆసక్తి చూపాడని, ఆ తర్వాత ఆ భూముల వ్యవహారంపై ఈఓడబ్ల్యూలో కేసులు నమోదు చేసి, సుదర్శన్ రెడ్డికి సన్నిహితులైన వ్యాపారులను విచారణ పేరుతో తీవ్రంగా వేధించారని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు.

విచారణ జరిపించాలి

ఈ కేసులో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరును చేర్చాలని ఒత్తిడి తెచ్చారని, ఆయన పలువురు అధికారులను సంప్రదించినా ఎలాంటి ఉపశమనం లభించలేదని ఆర్ఎస్ ప్రవీణ్ వెల్లడించారు. గురుకుల బంకర్ బెడ్ల కొనుగోలు వ్యవహారం, సివిల్ సప్లయ్స్‌లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై పెద్ది ఆధారాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించారని ఈ నేపథ్యంలోనే రూ.1,100 కోట్ల సివిల్ సప్లయ్స్ స్కామ్, స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలో బంకర్ బెడ్ల కొనుగోలు వ్యవహారంపై ఉన్నతాధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, హైకోర్టు, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారని తెలిపారు. ఈ అంశాలే పెద్ది సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కారణం అయ్యాయని ఆరోపించారు. ''కాంగ్రెస్ నేతల దోపిడీ, అవినీతిని ప్రశ్నించినందుకే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయుధ లైసెన్స్, సెక్యూరిటీ రద్దు చేశారు. అక్రమ కేసులతో వేధింపులకు గురి చేయడం వల్లనే మానసికంగా ఒత్తిడికి గురై హాస్పిటల్‌లో ఈరోజు పోరాడుతున్నారు. నిజంగా సెక్యూరిటీ రివ్యూ కమిటీ పారదర్శకంగా పని చేస్తే జానారెడ్డి, కొండా మురళి, జగ్గారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీకి చెందిన పసునూరి దయాకర్, ఆచార్యలకు సెక్యూరిటీ కొనసాగిస్తున్నారు? అనుముల తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, వరంగల్‌లో రౌడీ షీటర్‌గా పేరొందిన నవీన్ రాజ్, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్‌కు ఏ ప్రాతిపదికన సెక్యూరిటీ కల్పించారు డీజీపీ గారు?’’ అంటూ నిలదీశారు. నక్సలిజం లేదని తెలిసి, ఎలాంటి ముప్పు లేనప్పుడు రాష్ట్ర మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఎందుకు ఇస్తున్నారి ప్రశ్నించారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మంత్రులకు ఈ సౌకర్యాలు లేవు కదా, రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. లేదా లోపభూయిష్టంగా పని చేస్తున్న సెక్యూరిటీ రివ్యూ కమిటీని రద్దు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు.

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, స్వేచ్ఛ చైర్మన్,
9848070809

#BRS#RS Praveen Kumar#Peddi Sudarshan Reddy#Revanth Reddy#Telangana Politics#Swecha#Political Pressure#Health Crisis#Security Revocation#Investigative News#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి