మనలో చాలామందికి టీ తో రోజును ప్రారంభించే అలవాటు ఉంటుంది.. అయితే ఒకవేళ మీరు 30 రోజుల పాటు క్రమం తప్పకుండా టీ తాగడం మానేస్తే.. లేదా పూర్తిగా మానేస్తే, శరీరంలో కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మార్పులు ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండవని గుర్తుంచుకోవాలి.
ఇక టీలో ఉండే కెఫిన్ వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుందనే విషయం తెలిసిందే. టీ తాగడం తగ్గించడం వల్ల కొంతమందిలో నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పరగడుపున టీ ఎక్కువగా తాగేవారు దాన్ని తగ్గించడం వల్ల అసిడిటీ, గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. టీలోని కెఫిన్, టానిన్లు జీర్ణాశయాన్ని చికాకు పెడతాయి కాబట్టి, ఈ అలవాటును తగ్గించుకోవడం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు..
అలాగే రోజు ఎక్కువ సార్లు టీ తాగే అలవాటు ఉంటే పళ్లపై మరకలు పడతాయి. టీ తాగడం తగ్గించడం వల్ల కొత్తగా మరకలు ఏర్పడవు, అలాగే దంతాల రూపురేఖలు కూడా కొంత మెరుగుపడతాయి. అయితే దంతాల సంరక్షణకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా బ్రషింగ్ చేయడం, నోటి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఇక భోజనం చేసిన వెంటనే టీ తాగితే, మనం తిన్న ఆహారంలోని ఐరన్ ను శరీరం సరిగ్గా గ్రహించలేదని పరిశోధనలు చెబుతున్నాయి.
కాబట్టి భోజనం తిన్న తర్వాత కనీసం ఒకటి నుండి రెండు గంటల వరకు టీ తాగకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఐరన్ శోషణ మెరుగుపడుతుందని ముఖ్యంగా రక్తహీనత (అనీమియా) తో బాధపడేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అయితే టీకి ప్రత్యామ్నాయంగా తగినంత నీరు, కొబ్బరి నీళ్ళు లేదా చక్కెర లేని హెర్బల్ పానీయాలు తీసుకోవడం వల్ల శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుందని, ఇది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరిస్తున్నారు.
అయితే... టీని ఒక్కసారిగా పూర్తిగా మానేస్తే మొదటి రెండు నుంచి ఐదు రోజుల వరకు తలనొప్పి, అలసట, నిద్రమత్తు లేదా చిరాకు వంటి కెఫిన్ విత్‌డ్రాయల్ లక్షణాలు కనిపించవచ్చు. ఇవి సాధారణంగా తాత్కాలికమే. కాబట్టి టీ మానేయాలనుకుంటే ఒక్కసారిగా కాకుండా క్రమంగా తగ్గించడం మంచిది. అలాగే సమతుల్య ఆహారం, తగినంత నీరు, మంచి నిద్ర, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తేనే నిజమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












