హైదరాబాద్ మహానగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. పెరుగుతున్న జనాభాతో పాటు ప్రజా రవాణాపై కూడా భారీ ఒత్తిడి పెరుగుతోంది. ఈ సవాళ్లను దృష్టిలో పెట్టుకుని నగర రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో చిలకలగూడలో అత్యాధునిక బస్ టెర్మినల్‌తో పాటు ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ ప్రాజెక్టు దక్షిణ మధ్య రైల్వే, ఆర్టీసీ సంయుక్తంగా చేపడుతున్న భూముల మార్పిడి ప్రక్రియలో భాగంగా అమలు కానుంది. ప్రస్తుతం కాచిగూడ రైల్వే స్టేషన్ విస్తరణకు స్థలం అవసరం కావడంతో, కాచిగూడ డిపోలోని ఐదు ఎకరాల భూమిని రైల్వేకు ఇవ్వాలని ఆర్టీసీ ప్రతిపాదించింది. దీనికి బదులుగా చిలకలగూడలో ఐదు ఎకరాల భూమిని ఆర్టీసీ తీసుకుని అక్కడ అత్యాధునిక బస్ టెర్మినల్‌ను నిర్మించనుంది.
ఈ కొత్త టెర్మినల్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు, అలాగే రెతిఫైల్ బస్ స్టేషన్ వద్ద ప్రస్తుతం కనిపిస్తున్న ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. కొండాపూర్, మెహిదీపట్నం, చార్మినార్, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, పటాన్‌చెరు వంటి ప్రధాన మార్గాల్లో నడిచే బస్సుల్లో కొన్నింటిని కొత్త టెర్మినల్ నుంచి నడిపే అవకాశం ఉంది.
అంతేకాదు... కొత్త టెర్మినల్‌లో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లు, మెయింటెనెన్స్ షెడ్లు, విశాలమైన వెయిటింగ్ హాల్స్, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు వంటి ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో బస్సుల నిర్వహణ మరింత వేగంగా జరిగి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది. మరోవైపు.. సుమారు రూ.700 కోట్లతో కొనసాగుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల్లో భాగంగా 120 మీటర్ల స్కైవాక్ కూడా నిర్మించనున్నారు.
ఈ స్కైవాక్ ద్వారా సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్‌కు నేరుగా చేరుకునే సౌకర్యం కలుగుతుంది. ప్రస్తుతం ప్రయాణికులు నడవాల్సిన దూరం తగ్గి, రాకపోకలు మరింత సులభంగా మారనున్నాయి. మొత్తంగా... చిలకలగూడలో కొత్త బస్ టెర్మినల్, ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్, సికింద్రాబాద్ స్కైవాక్ వంటి ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో మరో కీలక మార్పు రానుంది. ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా, ప్రయాణికులకు మరింత వేగవంతమైన, ఆధునికమైన, సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.












