International

Bed sharing Trend: ‘లే ఆఫ్ భయం.. అద్దె భారం..’ చైనాలో 'బెడ్ షేరింగ్' ట్రెండ్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ఆర్థిక మాంద్యం, ఆశించిన స్థాయిలో పెరగని జీతాలు, భద్రత లేని ఉద్యోగాలతో (lay off scare) ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలోని యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పట్టణాల్లో పెరిగిన జీవన వ్యయాన్ని తట్టుకోలేక ఖర్చులు తగ్గించుకునేందుకు వింత సంస్కృతికి శ్రీకారం చుట్టింది.

 ఆర్థిక మాంద్యం, ఆశించిన స్థాయిలో పెరగని జీతాలు, భద్రత లేని ఉద్యోగాలతో (lay off scare) ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలోని యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పట్టణాల్లో పెరిగిన జీవన వ్యయాన్ని తట్టుకోలేక ఖర్చులు తగ్గించుకునేందుకు వింత సంస్కృతికి శ్రీకారం చుట్టింది. ప్రధాన నగరాల్లో నివాస వ్యయం చుక్కలు తాకుతుండటంతో అద్దె భారాన్ని సగం చేసుకునేందుకు యువత ఈ మార్గాన్ని ఎంచుకుంటోంది. చైనాలో ప్రస్తుతం మంచాన్ని పంచుకునే 'బెడ్ షేరింగ్'(bed sharing) ట్రెండింగ్‌ నడుస్తోంది.

 ఉదాహరణకు, వుహాన్ నగరానికి చెందిన 25ఏళ్ల సేల్స్ ఏజెంట్ విన్నీ జెంగ్ తన అద్దె గదిలోని మంచాన్ని మరో మహిళతో పంచుకుంటూ నెలకు 450 యువాన్లు (సుమారు 66 డాలర్లు) ఆదా చేస్తోంది. ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని అభద్రతా భావంతో పాటు ఆదాయం పెరగకపోవడమే తమను ఈ నిర్ణయం వైపు నెట్టిందని, డబ్బు లేనప్పుడు బతుకుదెరువు కోసం ఇలాంటి రాజీలు పడక తప్పడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

 ఈ రకమైన ఆర్థిక ఒత్తిళ్లు కేవలం సాధారణ ఉద్యోగులకే పరిమితం కాలేదు. బీజింగ్‌కు చెందిన 39 ఏళ్ల మోర్గాన్ పాన్ ఒకప్పుడు ఏఐ (AI) స్టార్టప్‌లో భారీ జీతం పొందినప్పటికీ, కంపెనీ మూతపడటంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు. పెరిగిన అద్దెలు భరించలేక ఆయన కూడా తన గదిని, మంచాన్ని మరొకరితో పంచుకోవడం ప్రారంభించాడు. ప్రస్తుతం చైనాకు చెందిన వీబో, డౌయిన్, జియాహోంగ్షు వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో "బెడ్-షేరింగ్" హ్యాష్‌ట్యాగ్‌లు, పోస్టులు లక్షలాది వ్యూస్‌తో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

 స్థిరమైన ఉపాధి లేకపోవడం, భవిష్యత్తుపై స్పష్టమైన ఆశలు కొరవడటమే చైనా యువతను ఇలాంటి తీవ్ర నిర్ణయాల వైపు నడిపిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. నగరాల్లో నిలదొక్కుకోవడానికి యువత ఖరీదైన దుస్తులు కొనడం మానేసి, బయటి ఆహారాన్ని త్యజించి తీవ్ర పొదుపు పాటిస్తోంది. పెరిగిన జీవన వ్యయానికి, యువత వాస్తవ పరిస్థితులకు ఈ 'బెడ్ షేరింగ్' వ్యవహారం స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తోంది.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి