మనిషి పుట్టిన క్షణం నుంచి చివరి శ్వాస వరకు... ఏదో ఒక కోరికతో జీవిస్తుంటాడు. చిన్నప్పుడు ఆటబొమ్మ కావాలి... పెద్దయ్యాక చదువు కావాలి... ఉద్యోగం కావాలి... సంపద కావాలి... గౌరవం కావాలి... చివరికి ఇంకా ఏదో కావాలి. ఒక కోరిక తీరగానే... మరో కోరిక పుడుతుంది. అందుకే మహర్షులు చెప్పారు... కోరికలకు అంతం లేదు... కానీ జీవితానికి మాత్రం అంతం ఉందని..
భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన గొప్ప సత్యం ఏమిటంటే... కోరికలే బంధానికి మూలం. కోరిక నెరవేరితే అహంకారం పుడుతుంది... నెరవేరకపోతే బాధ పుడుతుంది. ఈ రెండూ మనసుకు శాంతిని దూరం చేస్తాయి.
సముద్రంలోకి వేల నదులు చేరినా... సముద్రం తన హద్దులు దాటదు. అలాగే జ్ఞాని మనసులోకి ఎన్నో కోరికలు వచ్చినా... వాటికి బానిస కాడు. ఎందుకంటే అతనికి తెలుసు... నిజమైన ఆనందం వస్తువుల్లో కాదు... ఆత్మలో ఉందని.
మనం ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువును నాది అని భావిస్తాం. కానీ ఒక్కసారి ఆలోచించండి... ఈ ప్రపంచంలో మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు... వెళ్లేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్లలేం. మధ్యలో లభించిన ప్రతిదీ భగవంతుడు ఇచ్చిన బాధ్యత మాత్రమే..

కోరికలు తగ్గిన చోటే భక్తి మొదలవుతుంది. భక్తి పెరిగిన చోటే వైరాగ్యం వికసిస్తుంది. వైరాగ్యం వచ్చిన చోటే మనసు ప్రశాంతమవుతుంది. ప్రశాంతమైన మనసులోనే పరమాత్మ ప్రతిబింబిస్తాడు. అందుకే ప్రతి రోజు మనల్ని మనం ఒక్క ప్రశ్న అడగాలి...
నేను కోరికల కోసం జీవిస్తున్నానా... లేక జీవిత పరమార్థం కోసం జీవిస్తున్నానా? ఈ ఒక్క ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే... మన ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమైనట్టే.. కోరికలు తీర్చుకోవడం వల్ల మనిషి గొప్పవాడు కాడు. కోరికలను జయించడం వల్లే మహాత్ముడు అవుతాడు. ప్రపంచాన్ని గెలిచినవాడు విజేత కావచ్చు... కానీ తన మనసును గెలిచినవాడే యోగి... తన కోరికలను అధిగమించినవాడే ముక్తుడు.
అందుకే... జీవితాన్ని కోరికల పుట్టగా మార్చుకోవద్దు. దానిని భగవంతుని స్మరణతో వికసించే వనంగా మార్చుకోండి. కోరికల నుంచి భగవంతుని వైపు... మాయ నుంచి మాధవుని వైపు... అహంకారం నుంచి ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయండి. అప్పుడు తెలుసుకుంటారు... మనం వెతికిన ఆనందం బయట కాదు... మన హృదయంలోనే పరమాత్మ రూపంలో ఎప్పటి నుంచో వెలుగుతూ ఉందని..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంకేతిక సమాచారం. సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలని మనవి..












