ఎప్పుడూ ఆకలిగా అనిపిస్తుందా? ఎంత తిన్నా మళ్లీ తినాలనిపిస్తుందా? చాలామంది దీనిని సాధారణ విషయంగా తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది శరీరం ఇస్తున్న హెచ్చరిక కావచ్చని గమనించరు.. అయితే ఆకలి పెరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఎక్కువ వ్యాయామం చేయడం, సరిపడా నిద్ర లేకపోవడం, ఒత్తిడి లేదా సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఆకలి పెరగవచ్చని చెబుతున్నారు.
ఇక మధుమేహం ఉన్నవారిలో శరీరం గ్లూకోజ్‌ను సరిగా వినియోగించుకోలేకపోవడంతో కణాలకు తగిన శక్తి అందదు. దీంతో తరచూ ఆకలి వేయడం, అధిక దాహం, ఎక్కువసార్లు మూత్రవిసర్జన, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల జీవక్రియ వేగంగా జరిగి శరీరం ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఫలితంగా ఆకలి కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
మరోవైపు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా తగ్గిపోతే తీవ్రమైన ఆకలి, చేతులు వణకడం, చెమటలు పట్టడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ పరిస్థితిని హైపోగ్లైసీమియా అంటారు. అదేవిధంగా మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా భావోద్వేగాల ప్రభావంతో కొంతమంది అవసరానికి మించి ఆహారం తీసుకుంటారు. దీనిని ఎమోషనల్ ఈటింగ్‌గా పిలుస్తారని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.
అలాగే మహిళల్లో నెలసరి ముందు హార్మోన్ల మార్పుల కారణంగా కూడా ఆకలి పెరగడం సహజమే. కొన్ని స్టెరాయిడ్లు, యాంటీడిప్రెసెంట్ మందులు వంటి ఔషధాలు కూడా ఆకలిని పెంచే అవకాశం ఉంది. ఇలాంటి సమస్య తరచూ ఉంటే వైద్యులు HbA1c, థైరాయిడ్ పరీక్షలు TSH, T3, T4, అవసరమైతే CBC వంటి రక్త పరీక్షలను సూచించవచ్చు. అవసరాన్ని బట్టి ఇతర హార్మోన్ పరీక్షలు కూడా చేయించాల్సి రావచ్చని పేర్కొంటున్నారు.
అందుకే ఆకలిని నియంత్రించేందుకు గుడ్లు, పప్పుధాన్యాలు, పాలు, పనీర్ వంటి ప్రోటీన్ ఆహారం, ఓట్స్, సంపూర్ణ ధాన్యాలు, ఆకుకూరలు, ఆపిల్, బాదం, వాల్‌నట్స్, చియా గింజలు వంటి పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.. జంక్ ఫుడ్, అధిక చక్కెర ఉన్న పదార్థాలను తగ్గించి, తగినంత నీరు తాగుతూ, సమయానికి భోజనం చేయడం, రోజూ వ్యాయామం, కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర కూడా చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు..
అయితే ఆకలితో పాటు వేగంగా బరువు తగ్గడం, అధిక దాహం, తరచూ మూత్రవిసర్జన, చూపు మసకబారడం, తీవ్రమైన అలసట లేదా వణుకు వంటి లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యను ముందుగా గుర్తించి చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుందని తెలియచేస్తున్నారు..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












