Women Awarded 19 Lakhs: పనితీరు బాగోలేదని చెబుతూ ఒక మహిళా ఉద్యోగిని విధుల నుంచి తొలగించిన కంపెనీకి బిగ్ షాక్ తగిలింది. 19 లక్షలు ఫైన్ పడింది. ఈ 19 లక్షలు మహిళా ఉద్యోగినికి పరిహారంగా చెల్లించాల్సి వచ్చింది. సింగపూర్ లో ఈ ఘటన జరిగింది. సింగపూర్ ఎంప్లాయ్‌మెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ సదురు కంపెనీకి షాక్ ఇచ్చింది. ప్రొబేషన్ కాలంలో పనితీరు బాగోలేదనే సాకుతో మహిళా ఉద్యోగిని విధుల నుంచి తొలగించడాన్ని ట్రైబ్యునల్ తప్పుపట్టింది. ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఉద్యోగిని తొలగించడంలో సరైన ఆధారాలు చూపడంలో కంపెనీ విఫలమైందంటూ ట్రైబ్యునల్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
2025 ఏప్రిల్‌లో ఒక కంపెనీలో ఆడిట్ మేనేజర్‌గా ఆ మహిళా ఉద్యోగిని చేరింది. 6 నెలల ప్రొబేషన్ కాలపరిమితి ఇచ్చారు. అయితే, ఆ గడువు ముగిసే సమయంలో ఆమె పనితీరు సంతృప్తికరంగా లేదంటూ యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. తనను తొలగించడం అన్యాయమని భావించిన ఆమె.. ఎంప్లాయ్‌మెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. కంపెనీ చేసిన ఆరోపణలను ఆమె ఖండించింది. తన పనితీరుకు సంబంధించి ఎటువంటి మౌఖిక లేదా లిఖితపూర్వక హెచ్చరిక తనకు అందలేదని ఆమె వాదనలు వినిపించింది.
అలాగే, తనకు ఎప్పుడూ వివరించని పనితీరు ప్రమాణాల ఆధారంగానే తన పనితీరును అంచనా వేశారని ఆమె ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్లింది. ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించి అక్రమాలను బయట పెట్టినందుకే (విజిల్-బ్లోయర్‌గా వ్యవహరించినందుకే) తనను ఉద్యోగం నుండి తొలగించారని ఆ ఉద్యోగిని పేర్కొంది. కంపెనీలో పని భాషగా ఇంగ్లీష్ ఉన్నప్పటికీ, తనకు కొరియన్ భాష రాకపోవడం వల్ల వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆరోపించింది.
కంపెనీ కూడా తన వాదనలను వినిపించింది. ప్రొబేషన్‌లో ఉన్న ఉద్యోగులు కనీసం 80 శాతం స్కోర్ సాధించాల్సి ఉంటుందని, కానీ ఆమె కేవలం 71 శాతం మాత్రమే సాధించిందని తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న మేజిస్ట్రేట్.. స్పష్టంగా తెలుపని ప్రమాణాల ఆధారంగా ఉద్యోగుల పనితీరును అంచనా వేయడం లేదా వారిని తప్పుబట్టడం కుదరదని తీర్పునిచ్చారు. "పనితీరుకు సంబంధించిన ప్రమాణాలను స్పష్టంగా వెల్లడించని యజమాని, ఆ ప్రమాణాలకు అనుగుణంగా ఉద్యోగి వ్యవహరించలేదన్న కారణంతో వారిని అసమర్థులుగా పరిగణించలేరు" అని పేర్కొన్నారు.
పనితీరు ప్రమాణాల గురించి తెలియకపోవడానికి, వాటిని అందుకోలేకపోవడానికి మధ్య తేడా ఉందన్నారు. కంపెనీ తన ప్రొబేషన్ విధానాన్ని సరిగ్గా పాటించలేదని, దీనివల్ల ఉద్యోగం నుండి తొలగించడం అన్యాయమన్నారు. ఆ ఉద్యోగిని పనితీరులో మెరుగుదల అవసరమని ట్రిబ్యునల్ అంగీకరించినప్పటికీ, ఆమె పనితీరును అస్పష్టమైన ప్రమాణాల ఆధారంగా అంచనా వేశారని గుర్తించింది.
మొత్తంగా కంపెనీ నిబంధనల ప్రకారం ఆ ఉద్యోగినికి రేటింగ్ విధానాన్ని వివరించలేదని, సరైన పనితీరు సమీక్షలు నిర్వహించలేదని నిర్ధారించింది. కోర్టులో తమ వాదనలను నిరూపించడంలో యజమాన్యం విఫలం కావడంతో ట్రైబ్యునల్ మహిళకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆమె తొలగింపును అన్యాయమైనదిగా నిర్ధారిస్తూ.. ఆమెకు 19 లక్షలు పరిహారంగా చెల్లించాలని కంపెనీ యాజమాన్యానికి ఆదేశాలు ఇచ్చింది ట్రైబ్యునల్.












