ఏపీ

Cheddi Gang: ఏపీలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ కలకలం.. అన్నమయ్య జిల్లాలో హై అలర్ట్!..

రచన: Venu4 నిమిషాల పఠనం

గత కొంత కాలంగా అజ్ఞాతంలో ఉన్నట్టు నమ్మించిన ఈ గ్యాంగ్ తాజాగా అన్నమయ్య జిల్లాల్లో హాల్ చల్ చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పీలేరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు..

ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న పేరు చెడ్డి గ్యాంగ్... రాత్రి వేళల్లో ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, ముఖాలకు ముసుగులు ధరించి గుంపులుగా సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు పలు ప్రాంతాల్లో ఇదివరకు వెలుగులోకి వచ్చాయి.. అడ్డొచ్చిన వారిపై దాడులకు కూడా వెనుకాడరనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ఇలాంటి చెడ్డీ గ్యాంగ్ ముచ్చట మళ్లీ ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

గత కొంత కాలంగా అజ్ఞాతంలో ఉన్నట్టు నమ్మించిన ఈ గ్యాంగ్ తాజాగా అన్నమయ్య జిల్లాల్లో హాల్ చల్ చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పీలేరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.. జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి ఆదేశాల మేరకు రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పీలేరు పోలీసు సిబ్బంది అప్రమత్తమై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో పట్టణంలో ఉన్న ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి, గుర్తింపు పత్రాలు, వాహనాల వివరాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. రాత్రి వేళల్లో పోలీసు పహారాను మరింత పెంచడంతో పాటు సున్నిత ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. రాత్రి సమయాల్లో ఇళ్ల దగ్గర ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

పోలీస్ అధికారుల ప్రత్యేక నిఘా ఉన్నప్పటికీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించిన డీఎస్పీ కృష్ణమోహన్.. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే డయల్112కు సమాచారం అందించాలని కోరారు.. నేరాలను అదుపు చేయాలంటే ప్రజల సహకారం తప్పక ఉండాలని అన్నారు.. ఇక గతంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన చెడ్డి గ్యాంగ్.. ప్రస్తుతం మళ్ళీ వెలుగులోకి రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తీవ్రమైన, క్రూరమైన నేరచరిత్ర ఉన్న ఈ గ్యాంగ్ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలు పెట్టకముందే అధికారులు వాళ్ళ ఆట కట్టించాలనే అభిప్రాయాలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి..

#AP#Annamayya District#Pileru#DSP#Police#Warning#Cheddi Gang
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి