డిజిటల్ లావాదేవీలు పెరిగిన కొద్దీ.. సైబర్ నేరగాళ్ల మోసాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నాయి. ఫలితంగా ఒక్క క్లిక్, ఒక్క ఓటీపీ, ఒక్క నకిలీ లింక్ ఓపెన్ చేస్తే చాలు జీవితకాల సంపాదనను క్షణాల్లో మాయం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి.. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు దేశంలో సైబర్ నేరాల తీవ్రత ఏ స్థాయికి చేరుకుందో స్పష్టంగా చెబుతున్నాయి.
2020 నుంచి 2024 వరకు దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. 2020లో సుమారు 10 వేల కేసులు నమోదైతే.. 2024 నాటికి ఆ సంఖ్య 29 వేలకుపైగా చేరింది. అంటే ప్రతి ఏడాది సైబర్ నేరాల గ్రాఫ్ ప్రమాదకరంగా పెరుగుతోందని కేంద్రం వెల్లడించింది.
ఈ జాబితాలో అత్యధిక సైబర్ కేసులతో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. 2024లో తెలంగాణలో 18,922 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత బీహార్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ వివరాలను లిఖితపూర్వకంగా వెల్లడించారు.
మరోవైపు ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలే మొదటి స్థానంలో ఉన్నాయని, వాటి తర్వాత క్రెడిట్, డెబిట్ కార్డ్ ఫ్రాడ్స్, పెట్టుబడుల పేరుతో మోసాలు, ఏటీఎం మోసాలు, ఫేక్ కాల్స్, విషింగ్, గేమింగ్ యాప్‌ల ద్వారా మోసాలు, ఓటీపీ ఫ్రాడ్స్, యూపీఐ, ఈ-వాలెట్ మోసాలు అధికంగా నమోదవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగే ప్రతి డిజిటల్ వ్యవస్థని సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
మరోవైపు సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు ముమ్మరం చేసింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ద్వారా దేశవ్యాప్తంగా పర్యవేక్షణ కొనసాగుతోంది. అలాగే సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా 2026 జూన్ 30 నాటికి 32.80 లక్షలకుపైగా ఫిర్యాదులు అందగా.. రూ.11,158 కోట్లకు పైగా బాధితుల సొమ్మును కాపాడినట్లు బండి సంజయ్ వెల్లడించారు..
ఇక ఈ డిజిటల్ యుగంలో సౌకర్యాలు ఎంత పెరుగుతున్నాయో... సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. కాబట్టి తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, యూపీఐ పిన్‌లను ఎవరికైనా చెప్పడం వంటి పొరపాట్లు చేయకుండా అప్రమత్తంగా ఉండటమే సైబర్ మోసాల నుంచి రక్షణకు మొదటి అడుగు అని నిపుణులు సూచిస్తున్నారు..












