గుడికి వెళ్లినప్పుడు దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టడం మనలో చాలామందికి అలవాటుగా ఉంటుంది. కానీ.. ఈ ఆచారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా?.. కొబ్బరికాయకు బయట గట్టి పెంకు ఉంటుంది.. లోపల స్వచ్ఛమైన తెల్లని కొబ్బరి ఉంటుంది. మనిషి జీవితం కూడా ఇలాగే ఉంటుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
బయట కనిపించే అహంకారం, గర్వం, స్వార్థం.. ఇవన్నీ ఆ గట్టి పెంకులాంటివి. దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టడం అంటే.. మనలోని అహంకారాన్ని, స్వార్థాన్ని భగవంతుడి పాదాల వద్ద సమర్పించడమనే అని అంటున్నారు. కొబ్బరికాయలో ఉన్న నీరు.. మన మనసులోని స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు.. లోపల ఉన్న నీరు బయటకు వస్తుంది.
అదే విధంగా మనసులో దాచుకున్న కల్మషాన్ని తొలగించి.. నిజాయితీగా, నిర్మలమైన మనసుతో దేవుడిని ప్రార్థించాలనే సందేశం ఇందులో ఉంది. హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయను పూర్ణఫలంగా కూడా భావిస్తారు. పూజలో కొబ్బరికాయ సమర్పించడం అంటే.. మన శరీరం, మనసు, ఆలోచనలు, మన కర్మలు.. అన్నింటినీ భగవంతుడికి అర్పిస్తున్నామనే ఆధ్యాత్మిక సంకల్పం.
అయితే.. కొబ్బరికాయ కొట్టగానే కోరికలు నెరవేరతాయని కాదు. ఆచారం వెనుక ఉన్న అసలు భావాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టడం కంటే.. మనలో అహంకారాన్ని ముక్కలు చేయడం గొప్ప సమర్పణ. ఎందుకంటే.. భక్తి అంటే కేవలం దేవుడి ముందు నిలబడటం కాదు.. మనలోని చెడును గుర్తించి.. దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయడం. అందుకే గుడిలో కొబ్బరికాయ కొట్టే ప్రతిసారీ.. ఒకసారి మనసులో ఇలా అనుకోండి..
స్వామీ.. ఈ కొబ్బరికాయతో పాటు నా అహంకారాన్ని, నా స్వార్థాన్ని, నా చెడు ఆలోచనలను కూడా నీ పాదాల వద్ద సమర్పిస్తున్నాను. నన్ను మంచి మార్గంలో నడిపించు. అప్పుడు.. కొబ్బరికాయ కొట్టడం ఒక ఆచారం మాత్రమే కాదు.. మనసును శుద్ధి చేసుకునే ఒక ఆధ్యాత్మిక సాధనగా మారుతుందని పండితులు చెబుతున్నారు. మన పూర్వీకులు ఏర్పరచిన ప్రతి ఆచారం వెనుక ఒక భావం ఉంది.. ఒక తత్వం ఉంది.. ఒక జీవన సందేశం ఉంది. వాటిని అర్థం చేసుకుని ఆచరించినప్పుడే.. భక్తి మరింత లోతుగా మారుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంకేతిక సమాచారం. సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలని మనవి..












