Anti Paper Leak Bill: యాంటీ పేపర్ లీక్ బిల్లు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలకు చెక్ చెప్పేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఈ కీలకమైన బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది. విపక్షాల ఆందోళనల మధ్య మూజువాణి ఓటుతో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం పొందింది. విపక్షాలు కొన్ని సవరణలు కోరాయి. బిల్లును జేపీసీకి పంపాలని కొందరు ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే, ఎంపీలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయినట్లు లోక్ సభ స్పీకర్ ప్రకటించారు. దీంతో విపక్షాల ఆందోళనల మధ్యే యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం దక్కింది.
పేపర్ లీక్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి బిల్లులో నిబంధనలు రూపొందించామంది. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం, అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడడమే బిల్లు లక్ష్యమంది. యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం తర్వాత లోక్‌సభ సమావేశాలను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు.
ఏంటీ యాంటీ పేపర్ లీక్ బిల్లు..
ఇక నుంచి పేపర్ లీక్ కు పాల్పడితే శిక్షలు అత్యంత కఠినంగా ఉండనున్నాయి. పేపర్ లీక్ కు పాల్పడే వ్యక్తులు, అధికారులకు విధించే కనీస జైలు శిక్షను ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచారు. అలాగే రూ.50 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. పేపర్ లీక్ కేసుల విచారణను 2 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక, పేపర్ లీక్ కేసుల్లో వ్యవస్థీకృత నేరాల్లో దోషులకు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా ఈ బిల్లును రూపొందించారు. ఇదివరకు 3-5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10లక్షల వరకు జరిమానా ఉండేది. అదే వ్యవస్థీకృత నేరాల్లో 5-10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా ఉంది.












