Rahul Gandhi: లోక్ సభ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది కాంగ్రెస్. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెలరేగిపోయారు. నీట్ పేపర్ లీకేజీ, యువత ఆందోళనలపై రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇడియట్స్ అంటూ రాహుల్ చేసిన కామెంట్స్ కలకలం సృష్టించాయి.
సిట్ పేపర్ లీక్ పై యువత చేపట్టిన నిరసనలు కోపం, హింస లేదా ద్వేషం కాదని రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలు యువత భావప్రకటనా స్వేచ్చను గౌరవించాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత మాటను ఇడియట్స్ వినరు అని ఓ యువతి తనతో చెప్పిందని రాహుల్ అన్నారు. అంతే ఒక్కసారిగా సభలో దుమారం రేగింది. రాహుల్ ఇడియట్స్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు భగ్గుమన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు వారు అభ్యంతరం తెలిపారు. రాహుల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.
''విద్యార్థులు, మూర్ఖులు (ఇడియట్స్), అంధభక్తులు" అంటూ రాహుల్ గాంధీ ప్రస్తావించడం సభలో గందరగోళానికి దారితీసింది. అధికార ఎన్డీయే కూటమి దీన్ని అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ గా పరిగణించింది. ఇటీవలి విద్యార్థి నిరసనల నేపథ్యంలో నేను ఓ యువతితో మాట్లాడాను. ఆమె చాలా ఆసక్తికరంగా మాట్లాడింది. ప్రజలు మూడు వర్గాలుగా ఉంటారని ఆ 18 ఏళ్ల విద్యార్థి నాతో చెప్పింది. "విద్యార్థులు, మూర్ఖులు, ఆపై అంధభక్తులు" అని ఆమె తనతో చెప్పిందని రాహుల్ సభలో అన్నారు.
అనుచితమైన భాష..
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. "రాహుల్ గాంధీ అనుచితమైన పదాన్ని ఉపయోగించకపోయి ఉంటే, ఎవరూ అభ్యంతరం చెప్పేవారు కాదు. ఆయన ఒక విద్యార్థి పేరు మీద ఆ పదాన్ని వాడుతున్నారని నేను నమ్ముతున్నాను. కానీ దాన్ని వాడుతున్నది ఆయనే. ఆయన అనుచితమైన పదాన్ని వాడకూడదు, దాన్ని రికార్డుల నుంచి తొలగించాలి," అని రిజిజు డిమాండ్ చేశారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం రాహుల్ పై మండిపడ్డడారు. ఆయన ఉపయోగించిన పదాలను తొలగించాలని కోరారు. దీంతో ఆ పదాన్ని సభా కార్యకలాపాల నుండి తొలగించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు.












