రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణశాఖ చెబుతోంది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర తెలంగాణలో గడిచిన 20 గంటలుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ఎఫెక్ట్ ఉత్తర తెలంగాణ మీద ఉంటుందని వెదర్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.దీంతో రాగల 36 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని 'తెలంగాణ వెదర్ మ్యాన్' ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
జులై 29, 30 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా మారనున్నాయని.. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 300మిల్లిమీటర్ల నుంచి 450 మిమీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనివల్ల భారీగా వరదలు ముంచెత్తుతాయని హెచ్చరించారు. పింక్ అలర్ట్‌లో భాగంగా భారీగా వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లోని ప్రజలను వెంటనే అప్రమత్తం చేయాలని, అక్కడ ముందస్తు రక్షణ, సహాయకచర్యలు చేపట్టాలని స్థానిక జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మరోవైపు మధ్య, పశ్చిమ, తూర్పు తెలంగాణ పరిధిలో రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. ఫలితంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు రోజు మొత్తం ముసురు వాతావరణం నెలకొంటుందని వెదర్ మ్యాన్ వెల్లడించారు. నాగర్‌కర్నూల్, వనపర్తి, నల్గొండ వంటి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం స్వల్ప వర్షపాతం మాత్రమే నమోదు కానుందని చెప్పారు. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. కాగా,రెండ్రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ఇచ్చినట్టు తెలుస్తోంది.












