తెలంగాణలో దంచికొడుతున్న వానలు
తడిసి ముద్దవుతున్న అన్ని జిల్లాలు
ఉత్తర తెలంగాణలో కుండపోత
నదుల్లోకి పెరుగుతున్న ప్రవాహాలు
తెలంగాణలో కరువు తీరా వానలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో వాగులు, నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల వరద ఉద్ధృతికి రహదారులు కొట్టుకుపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జలాశయాలు నిండి జలకళ సంతరించుకున్నాయి.
మెదక్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హవేలీఘనపూర్ మండలంలోని దూప్‌సింగ్ తండా వాగు ఉప్పొంగుతోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తండాలో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గ ఆనకట్ట పొంగిపొర్లుతోంది.
జగిత్యాలలో జల ప్రళయం
జగిత్యాల జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ధర్మపురి మండలంలోని అనంతారం వాగు, నేరెళ్ల వాగు నేషనల్ హైవే పై నుంచి ప్రవహిస్తున్నాయి. దీంతో జగిత్యాల- ధర్మపురి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కల్లెడ నుంచి నుంచి యశ్వంతరావుపేట, వెల్గటూర్ మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. ఆక్సాయి పల్లె - నాగారం మధ్య రహదారికి గండి పడటంతో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నేరెళ్ల తోపాటు పలు గ్రామాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ధర్మపురి మండలంలోని ఆక్సాయిపల్లె లోలెవల్ వంతెన నీటిలో మునిగిపోయింది. గడిచిన 24 గంటల్లో జగిత్యాలలో 18.9 సెం.మీ వర్షం కురిసింది.
ఎల్‌నినో గండం తప్పినట్టేనా..?
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అధికారులు చెప్పినట్టే రెండు నెలలుగా అసలు వానలే లేవు. ఐతే రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షం కురవడంతో నగరంలోని చెరువులు నిండడం ప్రారంభమైంది.
కృష్ణా, గోదావరికి జలకళ
వర్షాల కారణంగా తెలంగాణలోని ప్రధాన నదులైన గోదావరి, కృష్ణాలో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. గోదావరి నది ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో ప్రవాహం పెరుగుతోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతమైన కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ భారీ వర్షాలు కురవడంతో జూరాల, శ్రీశైలం వైపు ఇన్‌ఫ్లోలు పెరుగుతున్నాయి.
ప్రస్తుతం ప్రధాన నదులు, ప్రాజెక్టుల్లో ఇన్‌ఫ్లోలు
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (కృష్ణా నది)
ప్రస్తుత ఇన్‌ఫ్లో: సుమారు 32,000 క్యూసెక్కులు
దిగువకు నీటి విడుదల: సుమారు 30,700 క్యూసెక్కులు
కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలతో కృష్ణా నదిలో ప్రవాహం పెరుగుతోంది. దీంతో జూరాల గేట్లు ఎత్తి నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి వస్తున్న వరద నీటితో ఇన్‌ఫ్లోలు క్రమంగా పెరుగుతున్నాయి. భీమా నది పరివాహక ప్రాంతంలో కూడా భారీ వర్షాల సూచనలతో రానున్న 24–48 గంటల్లో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
గోదావరి పరిస్థితేంటి..?
మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాల కారణంగా గోదావరిలో ప్రవాహం పెరుగుతోంది. ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్ (SRSP), కాళేశ్వరం పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
ఒకవైపు గోదావరి ఉప్పొంగుతోంది... మరోవైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. జూరాల వద్ద ఇప్పటికే దాదాపు 32 వేల క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా, 30 వేల క్యూసెక్కులకు పైగా నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు ఇంకా కొనసాగుతున్నందున రాబోయే రోజుల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు మరింత భారీ ఇన్‌ఫ్లోలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే పరిస్థితి గోదావరి బేసిన్‌లోనూ కనిపిస్తోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, కాళేశ్వరం వైపు నీటి ప్రవాహం రోజురోజుకూ పెరుగుతోంది.












