Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ లెగసీని ముందుకు తీసుకెళ్లేందుకు మరో యువ కెరటం టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రషా తడాని కథానాయకిగా నటించింది. జూలై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటోంది.
ఈ ప్రమోషన్ల పర్వంలో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయకృష్ణ.. షూటింగ్ సమయంలో తనకు ఎదురైన ఒక షాకింగ్ అనుభవాన్ని పంచుకున్నారు. సినిమా షూటింగ్ ఆరంభ రోజుల్లోనే జరిగిన ఒక సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన తెలిపారు. చిత్రీకరణలో భాగంగా హీరోయిన్‌పై ఒక యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగిందని జయకృష్ణ గుర్తుచేసుకున్నారు. ఆ ఘటనలో ఆమెకు గాయమై రక్తం రావడంతో సెట్స్‌లో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొందని చెప్పారు. తొలి సినిమా, అందులోనూ కెరీర్ ఆరంభ రోజుల్లోనే ఇలాంటి ఇన్సిడెంట్ ఎదురుకావడంతో తనను మానసికంగా కుంగదీసిందని జయకృష్ణ అన్నారు.
తోటి నటి పడుతున్న నొప్పులను చూసి తన మనసు చలించిపోయిందని, తెలియకుండానే తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని జయకృష్ణ చెప్పుకొచ్చాడు. ఒక నటుడిగా కెరీర్ ప్రారంభించిన కొత్తలోనే ఈ పరిణామం తనపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన వెల్లడించారు. కాగా, ఘట్టమనేని కుటుంబం నుంచి చాలా ఏళ్ల తర్వాత మరో హీరో వస్తుండటంతో అభిమానులలో అంచనాలు తారస్థాయికి చేరాయి. నటనపై ఆయనకున్న అంకితభావం, తోటి ఆర్టిస్టుల పట్ల చూపిన మానవత్వం ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చకు దారితీస్తున్నాయి. మరి ఈ మొదటి చిత్రంతో జయకృష్ణ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో వేచి చూడాల్సిందే.












