భారతీయ ఉపగ్రహ ఇంటర్నెట్ (సాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్) మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన ఇంటర్నెట్ సేవలందించకుండా, తమ ఏకస్వామ్యాన్ని(Monopoly) కాపాడుకోవడానికి కొందరు వ్యాపార దిగ్గజాలు (ఒలిగార్క్స్) స్టార్‌లింక్ సేవలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆయన ఎక్స్ (X) వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇది భారత ప్రజల హక్కులపై జరుగుతున్న నేరమంటూ మస్క్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. అయితే, మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వెంటనే స్పందించారు. భారత మార్కెట్‌లో స్వతంత్ర పోటీని దెబ్బతీస్తూ, వినియోగదారుల ప్రయోజనాలను కాలరాస్తున్న సదరు బడా పారిశ్రామికవేత్తల పేర్లను బహిరంగంగా వెల్లడించాలని కేటీఆర్ మస్క్‌ను కోరారు. దేశ ప్రజలకు మెరుగైన సాంకేతికత అందకుండా అడ్డుపడుతున్న వారి అసలు రూపాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
సాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపులు, భద్రతాపరమైన అనుమతుల ప్రక్రియ ఆలస్యం కావడం వెనుక టెలికాం రంగంలో ఉన్న ప్రధాన సంస్థల ప్రమేయం ఉందనే కోణంలో మస్క్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాగా, స్టార్‌లింక్ భారత్‌లో అవసరమైన అన్ని రకాల స్థానిక భద్రతా నిబంధనలను పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించినప్పటికీ, అనుమతుల జాప్యంపై ఈ వివాదం మరింత ముదిరింది. భారత్‌లో మారుమూల ప్రాంతాలకు హై-స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ అందించే క్రమంలో బిలియనీర్ల నడుమ సాగుతున్న ఈ శీతల సమరం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాపార, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.












