తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(SIR) ప్రక్రియలో భాగంగా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అభ్యంతరాలు, పరిశీలనల అనంతరం తుది ఓటర్ల జాబితాలో చేర్చడానికి మొత్తం 71.23 లక్షల మందిని అర్హులుగా గుర్తించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి.సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. నోటీసుల ఆధారంగా చేపట్టిన విచారణ ప్రక్రియను అక్టోబర్ 7 నాటికి పూర్తి చేసి, వీరందరికీ అర్హత కల్పిస్తూ అధికారికంగా ఆమోదం తెలిపారు.
ఓటర్ల వివరాల్లో తప్పులు, సాంకేతిక మార్పులు, అభ్యంతరాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92.88లక్షల నోటీసులు జారీ చేయగా, అందులో 91.92 లక్షల నోటీసులను నేరుగా సంబంధిత ఓటర్లకు అందజేశారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు కేటాయించిన గడువు అక్టోబర్ 7తో ముగిసింది. వచ్చిన వినతులన్నింటినీ నవంబర్ 5వ తేదీలోగా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం అన్ని ప్రక్రియలను ముగించుకుని నవంబర్ 9వ తేదీన అధికారికంగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.
గతంలో ఆగస్టు 17న నిర్వహించిన ఇంటింటి సర్వే ఆధారంగా ప్రచురించిన ముసాయిదా జాబితాలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. పరిశీలనలో భాగముగా అర్హత లేని 73.39 లక్షల ఓట్లను తొలగించారు. ఇందులో శాశ్వతంగా చిరునామా మారిన వారు 57.46 లక్షల మంది, మరణించిన వారు 9.22 లక్షల మంది కాగా, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగిన డ్యూప్లికేట్ ఓటర్లు 6.70 లక్షల మంది ఉన్నట్లు నిర్ధారించారు.
మరోవైపు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకే ఇంటి నంబర్‌పై 15 అంతకంటే ఎక్కువ ఓట్లు నమోదై ఉండటాన్ని బీజేపీ వర్గాలు గుర్తించి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి. డేటా విశ్లేషణలో దాదాపు 1.63 లక్షల వరకు ఇటువంటి అనుమానాస్పద ఓట్లు ఉన్నట్లు తేలిందని, వాటిపై బూత్ స్థాయి అధికారులతో (BLO) పునఃపరిశీలన జరిపించాలని బీజేపీ నేతలు సీఈఓను విజ్ఞప్తి చేశారు.


