నేటి సమాజంలో మానవ సంబంధాలు తమ విలువలను పూర్తిగా కోల్పోతున్నాయి. ఆవేశం మనుషులను ఆటబొమ్మలా ఆడిస్తోంది. ఒక్క క్షణకాలం విచక్షణ కోల్పోతే... జీవితకాలం తీరని శోకాన్ని, పశ్చాత్తాపాన్ని అనుభవించాల్సిందే అనడానికి ఈ దారుణ ఘటనే ఒక ఉదాహరణ. భార్యాభర్తల మధ్య గొడవలు, క్షణికావేశాలు వారి జీవితాలను బలితీసుకోవడమే కాకుండా, వారి పిల్లల పాలిట శాపంగా మారుతున్న సంఘటనలు కోకొల్లలు..
తల్లిదండ్రులు చేసిన తప్పులకు, చిన్నపాటి మనస్పర్థలకు కనీసం లోకం కూడా తెలియని పసిపిల్లల ప్రాణాలు తీయడం అత్యంత అమానుషం, హృదయవిదారకం. క్షణికావేశంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం.. ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపేసిన విషాదకర సంఘటన తమిళనాడులోని తెన్‌కాశి జిల్లాలో వెలుగుచూసింది.
ఇక స్థానికుల సమాచారం ప్రకారం.. శివగిరి సమీపంలోని వడక్కుసత్రం గ్రామానికి చెందిన కాళిపాండి(33) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి విరుదునగర్ జిల్లా దేవదానానికి చెందిన మారియమ్మాళ్(25)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కబినేశ్వరన్(5), రబినేశ్వరన్(4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మద్యపానానికి అలవాటు పడిన కాళిపాండి, తరచూ తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడని తెలుస్తుంది.
ఈ క్రమంలో, స్థానిక ఆలయంలో నిర్వహించిన ఒక ఉత్సవానికి మారియమ్మాళ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్ళింది. ఈ క్రమంలో అక్కడికి మద్యం మత్తులో వచ్చిన భర్త కాళిపాండి అందరి ముందూ భార్యను తీవ్రంగా అవమానిస్తూ మాట్లాడటంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ మహిళా ఇంటికి వెళ్లి తన ఇద్దరు కుమారులపై, తనపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. మంటల తీవ్రతకు వారు వేసిన కేకలు విన్న చుట్టుపక్కల ప్రజలు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
తీవ్ర గాయాలపాలైన మారియమ్మాళ్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడువగా. మంటల్లో కాలిన ఇద్దరు పసిపిల్లలను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ ఇద్దరు పిల్లలు కూడా మరణించారని సమాచారం..
కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవలసిన కన్నతండ్రి బాధ్యత మరచి తాగుడుకు బానిస అవడం, సమస్యను పరిష్కరించుకోలేక ఆ తల్లి ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి? ఈ ఘటనపై శివగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా, క్షణికావేశాలు నూరేళ్ల జీవితాలను, పసిపిల్లల భవిష్యత్తును బూడిదపాలు చేస్తున్నాయనడానికి ఈ విషాద ఘటనే నిదర్శనం..


