దేశంలోని ప్రముఖ ఆయిల్ కంపెనీలైన హెచ్‌పీ(HP), ఇండేన్ (Indane), భారత్ గ్యాస్ (Bharat Gas) నిబంధనల ప్రకారం ప్రతీ 5 సంవత్సరాలకు ఒకసారి గ్యాస్ వినియోగదారుల ఇంట్లో తప్పనిసరిగా సేఫ్టీ ఇన్ స్పెక్సన్ (Mandatory Safety Inspection) నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ఈ క్రమాన్ని ఆసరాగా చేసుకుని అనేక ప్రాంతాల్లో నకిలీ ఏజెంట్లు, కేటుగాళ్లు నకిలీ ఐడీలతో వచ్చి అమాయక ప్రజలను మోసగిస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి.
నిజమైన తనిఖీలను ఎలా గుర్తించాలో, మోసగాళ్ల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు. ఆయిల్ కంపెనీల అధికారిక నియమాల ప్రకారం, ఈ తనిఖీకి విధించే రుసుము సాధారణంగా GSTతో కలిపి రూ.200 నుంచి రూ.236 మధ్య మాత్రమే ఉంటుంది. ఈ ఇన్‌స్పెక్షన్ సమయంలో ఏజెంట్ ఇంటికి వచ్చి గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్, పైప్ సరిగ్గా ఉన్నాయా, లీకేజీ సమస్యలు ఏవైనా ఉన్నాయా? అని తనిఖీ చేస్తారు.
గ్యాస్ పేలిపోతుందని భయపెట్టి..
తనిఖీ పూర్తయిన తర్వాత ఏజెన్సీ అధికారిక రసీదును (Cash Memo) వినియోగదారునికి తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం దీనిపేరిట నకిలీ ఐడీలతో వస్తున్న కేటుగాళ్లు ‘మీ పైప్ లేదా సేఫ్టీ వాల్వ్ పాడైపోయింది, వెంటనే మార్చకపోతే సిలిండర్ పేలిపోతుంది’ అని భయపెట్టి రూ.500 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా, గ్యాస్ ఇన్ స్పెక్సన్ లేదా కేవైసీ(KYC) అప్‌డేట్ చేయాలంటూ ఫోన్‌చేసి వాట్సాప్‌లో ఏపీకే(APK) యాప్స్ లేదా ఆన్‌లైన్ లింకులు పంపి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసే సైబర్ మోసాలు కూడా పెరిగిపోయాయి.
వినియోగదారులు ఇంటికి వచ్చిన వ్యక్తిని తప్పనిసరిగా వారి గ్యాస్ ఏజెన్సీకి చెందిన ఐడెంటిటీ కార్డ్ చూపించమని కోరాలి. పైప్ లేదా వాల్వ్ మార్చాలని చెబితే వెంటనే ఒప్పకోకుండా నేరుగా ఏజెన్సీకి ఫోన్ చేసి నిర్ధారించుకోవాలి. అనధికారిక వ్యక్తులు పంపే యాప్‌లను ఇన్ స్టాల్ చేయడం గానీ, ఓటీపీ (OTP) షేర్ చేయడం గానీ చేయకూడదు. అనుమానం వస్తే గ్యాస్ పాస్‌బుక్‌పై ఉన్న డిస్ట్రిబ్యూటర్ నంబర్‌ను లేదా అధికారిక కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి.


