దేశంలో వెనుకబడినవర్గాలు, నిరు పేదలకు పక్కా నివాస సముదాయాలు ఉండాలనే ఉద్దేశంతో కేంద్రంలోని మోడీ సర్కార్ ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ (PMAY) పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS), తక్కువ ఆదాయ వర్గాలు (LIG), మధ్యతరగతి వర్గాలకు (MIG) సొంత పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి ఈ పథకం కింద కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తోంది.
అంతకాకుండా, ప్రతి ఇంటికీ తాగునీరు, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్ వంటి కనీస సదుపాయాలను కల్పించడం, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, మురికివాడల్లో నివసించేవారు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వర్గాలకు ఈ స్కీం కింద ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తారు. సొంత ఇంటినిర్మాణం , మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం సబ్సిడీ కింద కేంద్రం తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తోంది. ఈ స్కీంను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వినియోగించుకోవచ్చు.
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని నిరుపేదలకు పీఎంఏవై కింద లక్షల సంఖ్యలో ఇండ్లను కేంద్రం కేటాయించింది.అయితే, ఏపీలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) అర్బన్ 1.0 పథకం కింద కేటాయించిన ఇండ్లను కేంద్రం తాజాగా రద్దు చేసింది.
2024 కంటే ముందు మంజూరై ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు ప్రారంభించని దాదాపు 3.71 లక్షల గృహాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పీఎంఏవై అర్బన్ 1.0 పథకం గడువు వాస్తవానికి 2024 డిసెంబర్‌తో ముగిసింది. కానీ, పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు కేంద్రం ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించింది. అయినా, నిర్దేశించిన గడువు 2026 జులై నాటికి కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్మాణాలను ఏపీ ప్రభుత్వం చేపట్టకపోవడంతో కేంద్రం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
కేంద్రం తాజా నిర్ణయంతో ఏపీ సర్కార్ అయోమయంలో పడింది. రద్దు చేసిన ఇళ్లపై పున:పరిశీలన కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది.రాష్ట్రంలో జియో ట్యాగింగ్ పూర్తయిన 1.27 లక్షల ఇళ్లను తిరిగి పునరుద్ధరించాలని రిక్వెస్ట్ చేసింది. మిగిలిన ఇండ్లను కొత్తగా అమల్లోకి వచ్చిన PMAY-2.0 పథకంలోకి చేర్చాలని కేంద్రానికి విన్నవించినట్టు తెలిసింది.


