Mamitha Baiju: అ.! సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలోను పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. సాధారణంగా యువ దర్శకులెవరైనా స్టార్ స్టేటస్ వచ్చే వరకూ పక్కా కమర్షియల్ సినిమాలనే చేస్తూ మార్కెట్‌ను పెంచుకుంటారు. కానీ, వాళ్ళకి భిన్నంగా ప్రశాంత్ వర్మ..తన యూనివర్స్ నుంచి కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.
ఇక, ఇప్పుడు హను-మాన్ మూవీ సీక్వెల్ ‘జై హనుమాన్’తో అత్యంత భారీ స్కేల్‌లో సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రశాంత్ వర్మ.. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను కలిగేలా చేశాడు. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో తాజాగా మలయాళ హీరోయిన్ మమితా బైజు జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది.
మమితా ప్రస్తుతం సౌత్ ఇండియాలో బిజీగా మారిన హీరోయిన్లలో ఒకరు. ఇటీవల కోలీవుడ్ స్టార్ సూర్య సరసన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన ఈ బ్యూటీ.. వరుస అవకాశాలను అందుకుంటూ తోటి హీరోయిన్స్‌కి గట్టి పోటీని ఇస్తోంది. ఈ క్రమంలోనే, మమితా తాజాగా ‘జై హనుమాన్’లో భాగం కాబోతుందని సమాచారం.
కాగా, ‘జై హనుమాన్’ సినిమాలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే, లుక్ కూడా వచ్చి అందరినీ బాగా ఆకట్టుకుంది. అలాగే, రానా దగ్గుబాటి అశ్వత్థామ పాత్రను పోషించనున్నట్లు సమాచారం. తేజ సజ్జా నటిస్తున్న సంగతీ తెలిసిందే. ఇలాంటి, క్రేజీ కాంబినేషన్‌తో దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో..బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సరికొత్త రికార్డులు నమోదు చేస్తాడో చూడాలి.


