భారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ (SatCom) సేవలకు సంబంధించి అమలు చేస్తున్న నియంత్రణ వ్యవస్థ అత్యంత న్యాయబద్ధంగా, ఎలాంటి వివక్ష లేకుండా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) గురువారం అధికారిక వివరణ విడుదల చేసింది. నాన్-జియోసింక్రోనస్ శాటిలైట్ ఆర్బిట్ (NGSO) ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం ఇప్పటివరకు మూడు గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (GMPCS) సంస్థలకు టెలికాం లైసెన్సులు మంజూరు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
లైసెన్స్ పొందిన ఏజెన్సీలన్నీ వినియోగదారుల భద్రత, డేటా రక్షణకు సంబంధించిన కఠినమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ప్రస్తుతం లైసెన్స్ పొందిన మూడు కంపెనీల సెక్యూరిటీ అసెస్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని, ఇది పూర్తయిన తర్వాతే తదుపరి దశలో స్పెక్ట్రమ్ కేటాయింపు ప్రక్రియ ముందడుగు వేస్తుందని స్పష్టం చేసింది.
మార్కెట్‌లో ఒక సంస్థకు అనుకూలంగా, మరొక సంస్థకు ప్రతికూలంగా నిబంధనలు అమలు చేస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు వెల్లడించారు. టెలికాం రంగంలో పోటీ పడుతున్న ఆ మూడు సంస్థలు ప్రస్తుతం దాదాపు ఒకే స్థాయి నియంత్రణ పరిశీలన దశలో ఉన్నాయని వివరించారు. అందువల్ల ఎవరికీ ప్రత్యేక మినహాయింపులు లేదా అదనపు ప్రాధాన్యతలు ఇవ్వడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అడ్డుకుంటున్నారంటూ ఇటీవల విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ స్పష్టత ప్రాధాన్యం సంతరించుకుంది. జాతీయ భద్రత, డేటా ప్రైవసీ విషయంలో రాజీపడకుండా, అర్హత కలిగిన అన్ని సంస్థలకు సమాన ప్రాతిపదికన అనుమతులు మంజూరు చేస్తామని విదేశీ, స్వదేశీ టెలికాం రంగానికి ప్రభుత్వం స్పష్టమైన సందేశమిచ్చింది.












