అన్నదాతల పట్ల రేవంత్ సర్కార్ కర్కశత్వంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాగు కోసం నీళ్లు ఇవ్వలేదని అన్నదాతలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే, పంటలకు నీళ్లు ఇవ్వని సర్కార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపడం, నీటి కోసం పోరాటాలు చేస్తున్నందుకు రివర్స్‌లో వారిమీదే కేసులు పెడుతున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల ఆయకట్టు రైతులు జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగడం పాటు అధికారుల ప్రమేయం లేకుండా నీటిని దిగువకు వదిలిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలో పంటలు సాగు చేస్తున్న రైతులపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో రైతులకు సాగునీటి విడుదలకు నిరాకరించడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
దీంతో సెప్టెంబర్ 19న రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు నీటిని విడుదల చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టు మీదకు చేరుకుని నిరసన కార్యక్రమం చేశారు. సాగునీటిని వెంటనే విడుదల చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో అదే రోజు సాయంత్రం, రైతులు జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ గేట్లను ఎత్తి నీటిని స్వయంగా విడుదల చేసుకున్నారు.
అయితే, ప్రాజెక్టు ఇరిగేషన్ డీఈ ఫిర్యాదు మేరకు రైతులు, వారికి సాయం చేసిన కొందరు స్థానిక పార్టీల నేతలపై అమరచింత పోలీస్‌స్టేషన్ లో కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడినట్టు సమాచారం. కేసులు పెట్టడంతో పాటు కొందరు రైతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది.విషయం బయటకు రావడంతో ప్రతిపక్ష పార్టీల నేతలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నట్టు సమాచారం. దేశానికి అన్నం పెట్టే రైతులకు సాగు నీళ్లు ఇవ్వకుండా ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు తిరిగి కేసులు పెడతారా? అని నేతలు మండిపడుతున్నారు.


