ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) సవ్యంగా జరగడం లేదని, అర్హుల ఓట్లు తొలగిస్తున్నారని, ఓటు చోరీ జరిగిందని ఆరోపిస్తూ ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కూటమి ఎంపీలను నిన్న పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వారికి సంఘీభావం తెలిపారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వం, సీఈసీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోనూ నిరసనలకు పిలుపునిచ్చారు.ఈ క్రమంలోనే దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ 'సేవ్ డెమోక్రసీ' పేరిట నగరంలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు సంయుక్తంగా ఆందోళనా కార్యక్రమం చేపట్టాయి. కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కూటమి నేతలు గురువారం భారీ ర్యాలీ చేపట్టారు.
కాంగ్రెస్, వామపక్ష నేతలు కలిసి నెక్లెస్ రోడ్ మీదుగా లోకభవన్ వైపు భారీ ర్యాలీగా బయలుదేరారు. "ప్రజాస్వామ్యాన్ని కాపాడండి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అయితే, నిరసన కారులు లోక్‌భవన్‌కు చేరుకోకుండా నెక్లెస్ రోడ్‌లోనే పోలీసులు అడ్డుకున్నారు. ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఆందోళన కారులు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అరెస్టు చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్‌ను పోలీసు వాహనం ఎక్కించి పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. పలువురు మంత్రులు, సీనియర్ నేతల అరెస్ట్ గురించి తెలియడంతో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ వద్దకు కాంగ్రెస్, వామపక్ష కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కేంద్రం, ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలను మోడీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.












