Police Suspend: బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయం చేస్తున్నారు. బాధ్యతగా డ్యూటీ చేయాల్సిన ఖాకీలు దారితప్పుతున్నారు. కొందరు పోలీసులు లంచాలకు రుచి మరిగారు. ఛాన్స్ చిక్కితే చాలు దోచుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి వ్యవహారం ఒకటి కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. లంచం డిమాండ్ చేసిన పోలీసులు అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
చలానా కట్టేసినా లంచం డిమాండ్!
కరీంనగర్ జిల్లాలో లంచం డిమాండ్ కేసులో ముగ్గురు పోలీసులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. జేసీబీ, ట్రాక్టర్ విడుదలకు తిమ్మాపూర్ సీఐ రమేశ్, ఎస్ఐ, కానిస్టేబుల్ లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపించాడు. జరిమానా చలానా కట్టేసినా, తహశీల్దార్ రిలీజ్ ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు తన వాహనాలు వదిలిపెట్టలేదని తెలిపాడు. లక్ష రూపాయలు ఇస్తేనే వాహనాలు ఇస్తామని పోలీసులు బేరం ఆడారు. దీంతో వాహనాల యాజమాని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ జరిపారు. విచారణలో లంచం డిమాండ్ తేలడంతో సీఐ రమేశ్, ఎస్ఐ సయ్యద్ అన్వర్, కానిస్టేబుల్ అజీజ్ లను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
లంచగొండి ఖాకీలపై చర్యలు
లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో మొదట ఈ ముగ్గురిని హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేశారు. ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరిపించారు. లంచం తీసుకున్నట్లు విచారణలో రుజువైంది. దీంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. లంచగొండి పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, తమ చేతికి మట్టి అంటకుండా పోలీసులు తెలివిగా వ్యవహరించారు. వైన్ షాప్ నిర్వాహకుడికి ఫోన్ పే ద్వారా రూ.20వేలు లంచం పంపినట్లు వాహనాల యజమాని ఆధారాలతో సహా నిరూపించాడు. దీంతో ఉన్నతాధికారులు ఆ ముగ్గురు పోలీసులపై యాక్షన్ తీసుకున్నారు. అవినీతికి పాల్పడే పోలీసులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.












