Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. సింగరేణి ప్రైవేటీకరణకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. సింగరేణిలో లాభాలు తగ్గిస్తూ, ఉత్పత్తిని తగ్గిస్తూ, దీన్ని ఒక ఫెయిల్యూర్ సంస్థగా చూపించి ప్రైవేటేజేషన్ వైపుగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. అటువంటి చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు హరీశ్ రావు.
సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి శ్రీకారం చుడుతుందని హరీశ్ రావు ప్రకటించారు. అందులో భాగంగా ఈ నెల 14న రామగుండంలో భారీ బహిరంగ సభ పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ భవన్ లో సింగరేణి కార్మికులు, నేతలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు హరీశ్ రావు.
సింగరేణి కార్మికులకు తీరని అన్యాయం
సింగరేణి కార్మికులకు రేవంత్ సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. సింగరేణి కార్మికులు కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని వాపోయారు. సింగరేణికి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 33శాతం వాటా ఇస్తామని నాడు ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్.. నేడు 16శాతం వాటా మాత్రమే ఇచ్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ చర్యలతో సింగరేణి నాశనం అవుతోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణిలో ఏటేటా బొగ్గు ఉత్పత్తి పెంచామని.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏటేటా ఉత్పత్తి తగ్గిందన్నారు.
కుంభకోణాల గనిగా సింగరేణి
సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చేశారని రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు హరీశ్ రావు. సింగరేణిలో పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కార్మికులు రోడ్డున పడ్డారని వాపోయారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటాలు ఇవ్వడంతో పాటు వెంటనే సింగరేణి ఎన్నికలు జరిపించాలని, అలాగే బకాయిలు విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఏటా బొగ్గు ఉత్పత్తిని పెంచామన్న హరీశ్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని పేర్కొన్నారు. ఏకంగా 12 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మీ అవినీతి వల్లే బొగ్గు ఉత్పత్తి తగ్గింది
''2021-22లో బొగ్గు ఉత్పత్తి 65 మిలియన్ టన్నులు ఉండేది. 2022-23లో 65 నుంచి 67 మిలియన్ టన్నులకు బొగ్గు ఉత్పత్తి పెరిగింది. 2023-24 70 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇక కాంగ్రెస్ రాగానే ప్రొడక్షన్ పడిపోయింది. 70 మిలియన్ టన్నుల నుంచి 2024-24లో 69 మిలియన్ టన్నులకు తగ్గింది. 2025-26లో 58 మిలియన్ టన్నులకు తగ్గింది. అంటే దాదాపు 12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గింది. బీఆర్ఎస్ ఉంటే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెరిగింది ఎందుకు? కాంగ్రెస్ రాగానే బొగ్గు ఉత్పత్తి తగ్గింది ఎందుకు? భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలి. ఇదంతా మీ అవినీతి వల్లే. లేని సైట్ విజిట్ సర్టిఫికెట్ ను సింగరేణి ఓపెన్ కాస్ట్ టెండర్లలో తెచ్చి పెట్టారు. నీతి, నిజాయితీగా పని చేస్తున్న డైరెక్టర్లను, అధికారులను మీరు తొలగించారు.
లాభాలు తగ్గిపోయాయి
2023-24లో సింగరేణి పూర్తి లాభాల్లో కార్మికులకు కేవలం 16శాతం వాటా మాత్రమే ఇచ్చారు. 2024-25లో కార్మికులకు 12.5 శాతం మాత్రమే లాభాల్లో వాటా ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చింది 33శాతం అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ఏడాది 16శాతం, రెండో ఏడాది 12.5 శాతం మాత్రమే ఇచ్చారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు లాభాలు డిక్లేర్ చేయలేదు, లాభాల్లో కార్మికుల వాటా ఎంతో కూడా తేల్చడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బంధుప్రీతి, అవినీతి, అనాలోచిత నిర్ణయాలు, పరిపాలనా వైఫల్యం.. వెరసి లాభాలు బాగా తగ్గుముఖం పడుతున్నాయి.
మీ అవినీతి, పరిపాలనా వైఫల్యం వల్లే లాభాలు తగ్గాయి
2022-23లో సింగరేణికి 2వేల 222 కోట్లు లాభాలు వచ్చాయి. 2023-24లో 4వేల 712 కోట్లు లాభాలు వచ్చాయి. 2024-25లో 6వేల 394 కోట్ల లాభాలు వచ్చాయి. ఈ సంవత్సరం ఇంతవరకు లాభాలను ప్రభుత్వం డిక్లేర్ చేయలేదు. మాకు అందుతున్న సమాచారం ప్రకారం లాభాలు రూ.1800 కోట్లు కూడా మించదంటున్నారు. ఎక్కడ 6వేల కోట్లు, ఎక్కడ 1800 కోట్లు.. లాభాలు ఎందుకు పడిపోతున్నాయి. సింగరేణిలో దాదాపు 3వంతుల లాభాలు తగ్గుతున్నాయి. ఇది పరిపాలన వైఫల్యం కాదా? మీ అవినీతి, బంధుప్రీతి, తుగ్లక్ నిర్ణయాల వల్లే ఈరోజు సింగరేణి లాభాలు పడిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అటు సింగరేణికి, ఇటు కార్మికులకు తీరని నష్టం జరుగుతోంది.
ప్రతి కార్మికుడికి 250 గజాల స్థలం, 20లక్షలు ఇవ్వాలి
ప్రతి కార్మికుడికి 250 గజాల స్థలం, 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లైంది. ఇంతవరకు ఒక్క కార్మికుడికి స్థలం ఇచ్చింది లేదు, ఒక్క కార్మికుడికి రుణం ఇచ్చింది లేదు. ఇప్పటికైనా మీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సింగరేణిలో అర్హులైన ప్రతి కార్మికుడికి ఇంటి స్థలం, 20 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
సింగరేణి ప్రైవేటీకరణకు కుట్రలు
సింగరేణి ప్రైవేటీకరణకు కూడా ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. లాభాలు తగ్గిస్తూ, ప్రొడక్షన్ తగ్గిస్తూ దీన్ని ఒక ఫెయిల్యూర్ సంస్థగా చూపించి ప్రైవేటేజేషన్ వైపు అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు లాభాలు పెరిగాయి, ఉత్పత్తి పెరిగింది, కార్మికుల వాటా కూడా పెరిగింది. కానీ కాంగ్రెస్ రాగానే లాభాలు తగ్గుతున్నాయి, ప్రొడక్షన్ తగ్గుతోంది, కార్మికుల వాటాలు తగ్గుతున్నాయి.
14న రామగుండంలో భారీ బహిరంగ సభ
కార్మికులను తగ్గించి డిపెండెంట్ ఉద్యోగాలు లేకుండా చేసి ప్రైవేట్ చేసే కుట్రలు చేస్తున్నారు. దాన్ని మానుకోవాలి. అటువంటి చర్యలు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఫైనల్ గా ఈ అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు కార్మికుల పక్షాన బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగా ఈ నెల 14న రామగుండంలో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని నిర్ణయించాము'' అని హరీశ్ రావు ప్రకటించారు.


