National

Bullet train: హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణంపై బిగ్ అప్ డేట్!..

రచన: Venu••5 నిమిషాల పఠనం

హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రెండు ప్రధాన ఐటీ నగరాలను అనుసంధానించే ఈ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం పెరిగింది.

హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రెండు ప్రధాన ఐటీ నగరాలను అనుసంధానించే ఈ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం పెరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలనతో ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది.

ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్, సబ్ స్టేషన్ నిర్మాణాల కోసం ప్రాథమిక స్థల పరిశీలన పూర్తయింది. ఈ క్రమంలో జిల్లా ఉన్నతాధికారులతో కలిసి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, క్షేత్రస్థాయిలో ఈ స్థలాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కారిడార్ రూట్ మ్యాప్‌పై కీలక వివరాలు వెల్లడించారు.

హైదరాబాద్‌లోని శంషాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ బుల్లెట్ రైలు... ఫ్యూచర్ సిటీ, ఆమనగల్లు, కల్వకుర్తి, మన్ననూర్, అచ్చంపేట, శ్రీశైలం మార్గం మీదుగా బెంగళూరుకు చేరుకుంటుందని వివరించారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లాలంటే సాధారణ రైలులో సుమారుగా 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. కానీ ఈ హైస్పీడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం రెండు నుండి మూడు గంటల్లో బెంగళూరుకు చేరుకోవచ్చి తెలుస్తుంది.

మరోవైపు దేశంలో ఇప్పటికే అహ్మదాబాద్-ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో, సౌత్ ఇండియాలోనూ ఇలాంటి ప్రాజెక్ట్ రావాలన్న నిరీక్షణకు ఈ కారిడార్‌తో తెరపడనుంది. ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే టెక్నాలజీ, ఐటీ, పరిశ్రమలు, పర్యాటకరంగాల్లో రెండు మెట్రో నగరాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. అలాగే నగరం నుండి బెంగళూరుకు రాకపోకలు కూడా పెరగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక మూడు గంటల సమయం అంటే ప్రస్తుతం నగరంలో ఏ మూలకు వెళ్లాలన్న అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. దానిమీద ఈ ప్రయాణం బెటర్ అని అనుకోవచ్చు.. మరోవైపు ఈ కారిడార్ నిర్మాణం వల్ల నాగర్‌కర్నూల్ జిల్లా రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు రవాణా సౌకర్యం సులభతరం కానుంది. దీంతో పాటు స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధి ఊపందుకోవడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ వల్ల భూములు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్టం జరగకుండా పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ హైస్పీడ్ కారిడార్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే నాగర్‌కర్నూల్ జిల్లా అభివృద్ధిలో ఒక కొత్త శకానికి నాంది పడుతుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..

#Hyderabad Bengaluru Bullet Train#High Speed Rail Corridor#South India Bullet Train#Hyderabad Bengaluru Travel Time#Nagarkurnool Railway Project#Achampet Bullet Train Route#Srisailam High Speed Rail#Telangana Infrastructure News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి