తెలంగాణ

Telangana: అన్నమో రామచంద్రా అనాల్సిందేనా?.. గంజి నీళ్లకైనా గతి ఉంటుందా?..

రచన: Venu•••5 నిమిషాల పఠనం

ఒక మనిషి జీవితాని ఆహారం ఎంత అవసరమో అందరికీ తెలిసిందే.. ఆకలికి రాజు పేద, చిన్నా పెద్ద అనే తేడా ఉండదు.. అయితే డబ్బులున్న మారాజులు ఆహారం ఎంత ఖరీదు అయిన కడుపునింపు కోవడానికి వెనుక ముందు ఆలోచించరు.

ఒక మనిషి జీవితాని ఆహారం ఎంత అవసరమో అందరికీ తెలిసిందే.. ఆకలికి రాజు పేద, చిన్నా పెద్ద అనే తేడా ఉండదు.. అయితే డబ్బులున్న మారాజులు ఆహారం ఎంత ఖరీదు అయిన కడుపునింపు కోవడానికి వెనుక ముందు ఆలోచించరు. ఎటొచ్చీ పేద మధ్య తరగతి మనుషులకు మాత్రం అది భారంగా మారుతుంది. ఇక ఊహించని విధంగా ఏర్పడే ప్రకృతు వైపరీత్యాల వల్ల ఎక్కువగా బలైయ్యేది మధ్యతరగతి మనుషులే అని ఎల్‌నినో ఎఫెక్ట్ కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది.

అయినా మానవ తప్పిదాల వల్ల ఏర్పడే విపత్తులకు బాధ్యత వహించవలసింది మానవుడే.. ఇక తాజాగా ఈ సంవత్సరం వర్షాలు ఆశించినంత లేకపోవడంతో ఆ ప్రభావం ప్రతిదానిపై పడుతుంది. ఇప్పటికే నీటి కొరత ఏర్పడగా ఆ భారం నిత్యావసరాల పై పడుతుంది. ఈ క్రమంలో బియ్యం ధర సెంచరీ కొట్టింది. ఇప్పటివరకు ఏ నిత్యావసరాల ధరలు పెరిగినా, బియ్యం రేట్లు మాత్రం ఇంత దారుణంగా పెరిగిన దాఖలాలు లేవు.

కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. ఏమి కొనేటట్టు లేదు.. ఏమి తినేటట్టు లేదు అనే పాత పాటను బడుగు జీవులు మళ్లీ పాడుకోవాల్సిన దారుణ పరిస్థితులు వచ్చేశాయి. ఇక బంగారం ధరలు పెరిగితే మోజు తగ్గించుకుని కొనడం మానేయొచ్చు. కానీ బియ్యం ధరలు పెరిగితే పొయ్యి మీద గిన్నె ఉడికేది ఎలా? ఇదే ఇప్పుడు ప్రతి సాధారణ కుటుంబం వేదన. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో నిన్న మొన్నటి వరకు కిలో 50 నుంచి 55 రూపాయలు ఉన్న సాధారణ సన్నబియ్యం, గత నాలుగు నెలల్లోఏకంగా 85 రూపాయలకు ఎగబాకడం ఆందోళన కలిగిస్తుంది.

అదేవిధంగా పండుగ సీజన్ వచ్చేనాటికి తమిళనాడు సహా పొరుగు రాష్ట్రాల్లో నాణ్యమైన బియ్యం ధర కిలో వంద రూపాయలు దాటడం ఖాయమని మిల్లు యజమానులే అంచనా వేస్తున్నారు. ఇక బాస్మతి వంటి ప్రీమియం రకాలైతే కిలో 130 నుంచి 240 రూపాయల పైనే పలుకుతుండడంతో ఆ భారం జనాలపై మోయలేనంతగా పడుతుందని గగ్గోలుపెడుతున్నారు.

ఇక దేశంలో ఇంతకాలం అవసరానికి మించి వరి పంట పండింది. ఏనాడూ ధాన్యానికి కొరత రాలేదు. కానీ ఈసారి 'ఎల్ నినో' రూపంలో రాకాసి దెబ్బ కొట్టింది. వర్షాభావ పరిస్థితుల వల్ల వరి సాగు విస్తీర్ణం తగ్గి, దిగుబడి ఘోరంగా పడిపోయింది. మార్కెట్‌లో ధాన్యం నిల్వలు నిండుకోవడంతో ఓపెన్ మార్కెట్‌లో మిల్లు యజమానులు ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు ఎరువుల రేట్లు, కూలీల ఖర్చులు, రవాణా ఛార్జీలు పెరగడం బియ్యం ధరల మంటకు మరింత ఆజ్యం పోసింది.

ఈ పరిస్థితుల్లో ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవలసిన ప్రభుత్వం ఉత్తమాటలతోనే కాలయాపన చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితం కనిపించడం లేదు కానీ ప్రభుత్వం మాటలతో కోటలు కడుతుందని జనం అంటున్నారు.. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో నాణ్యమైన బియ్యం ధరలకు రెక్కలు రావడంతో, మున్ముందు గంజి నీళ్లయినా దక్కే పరిస్థితి ఉంటుందా అని పేద ప్రజలు ఠారెత్తిపోతున్నారు. పాలకులైనా తక్షణమే స్పందించి, బియ్యం ధరలను అదుపు చేసి సామాన్యుడిని 'అన్నమో రామచంద్రా' అనకుండా కాపాడాలని కోరుకుంటున్నారు..

#Rice Price Hike#El Nino Impact#Food Grain Inflation#Essential Commodities Price#Rice Rate Century#Common Man Struggles#Agriculture News#Market Price Update
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి