వివాహేతర సంబంధాల మత్తులో పడి కొందరు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.పరువు మర్యాదలు మంటగలుస్తున్నాయి. పేరెంట్స్ చేసిన తప్పుకు పిల్లలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇద్దరు చేసే తప్పుకు ఇరువైపులా కుటుంబాలు బాధపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా పెళ్లయిన వ్యక్తి ప్రియురాలిని మర్చిపోలేక దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఏపీలోని విజయవాడలోని దుర్గ అగ్రహారంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. విజయవాడకు చెందిన నాగరాజు (31)కు మూడేళ్ల కిందట తన ఇంట్లో కుటుంబంతో కలిసి అద్దెకు దిగిన వివాహితతో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.అయితే, నాగరాజుకి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో మూడు నెలల కిందట పక్కనున్న డాబాలోకి సదరు మహిళ ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యింది.
పెళ్లయిన 35 రోజుల తర్వాత నాగరాజు భార్య 16 రోజుల పండుగకు పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే వివాహితను మర్చిపోలేక తన ఇంట్లోకి తిరిగి అద్దెకు రావాలని అతడు ఒత్తిడి చేయడం ప్రారంభించాడు.అందుకు సదరు మహిళ నిరాకరించింది.ఎవరి జీవితాలు వాళ్లు చూసుకుందామని హితవు పలికింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నాగరాజు ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. అనంతరం తానూ పొడుచుకొని పక్కనున్న రైవస్ కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే కాలువలోకి దూకి నాగరాజును కాపాడే ప్రయత్నం చేశారు. ఒడ్డుకు చేర్చి స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, తన భర్త నాగరాజు చేసిన ఈ దురాగతం తెలిసి అతని భార్య షాక్‌కు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


