పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నవరాత్రుల సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నార్త్ కోల్కతాలోని ప్రసిద్ధ చోర్బాగన్ సార్వజనీన్ దుర్గాపూజా పండల్ వద్ద శనివారం రాత్రి అనుకోకుండా తొక్కిసలాట నెలకొంది. ఈ ప్రమాదంలో కనీసం 17 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 25 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. దుర్గమాత దర్శనం కోసం వేలాది మంది భక్తులు పోటెత్తిన సమయంలో అకస్మికంగా భారీ వర్షం కురిసింది.
దీంతో ప్రజలు తలదాచుకునేందుకు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ క్రమంలోనే అక్కడ తీవ్ర తోపులాట జరిగినట్టు సమాచారం. తోపులాట కారణంగా కొందరు మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు కిందపడిపోయినట్టు తెలిసింది. అదే సమయంలో చాలా మంది పరుగులు తీయగా కింద పడిపోయిన వారిని తొక్కుకుంటూ జనాలు ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. తొక్కిసలాటలో ఊపిరాడక, బలమైన గాయాలు కావడంతో పలువురు స్పాట్లోనే మరణించారు.
ఈ దుర్ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, క్షతగాత్రులను వెంటనే కలకత్తా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించి మెరుగైన అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు. సీఎం స్వయంగా ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించడంతో పాటు సహాయక చర్యలను పర్యవేక్షించారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్, భారీగా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. భద్రతా కారణాల దృష్ట్యా చోర్బాగన్ పండల్ను అధికారులు పూర్తిగా మూసివేశారు. పండుగ పూట ఇంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో నగరవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ తీవ్ర విషాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం స్పందించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలపడంతో పాటు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.


