దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి.ప్రజారవాణా వ్యవస్థ టీజీఎస్ఆర్టీసీ ‘స్పెషల్’ సర్వీసుల పేరిట అదనపు చార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రయాణాన్ని బట్టి చార్జీలు పెరుగుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం లాంటి దూర ప్రాంతాలకు జర్నీ చేసే వారికి ఒక్కరికే టికెట్ ధర రూ.500 నుంచి 700 మధ్యలో ఉన్నట్టు తెలుస్తోంది.ఎక్స్‌ప్రెస్,డీలక్స్,సూపర్ లగ్జరీ, ఈవీ సర్వీసులను బట్టి టికెట్ ధరలు భిన్నంగా ఉన్నాయి.
సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ బస్ టికెట్ ధర రూ.290 నుంచి 320 మధ్యలో ఉండగా, ఇప్పుడు రూ.400కు పైగా వసూలు చేస్తున్నట్టు తెలిసింది.అయితే, ఒక్కరికే ఇంత చార్జ్ అయితే ఒక కుటుంబంలో నలుగురు ఉంటే వాళ్ల పరిస్థితి ఏంటని, రానుపోను టికెట్ చార్జీలకే రూ.5 వేలకు పైగా ఖర్చు కానుంది. ఇక సామాన్యుడు దసరా పండుగ ఎలా చేసుకోవాలి? అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదిలాఉండగా, ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో దసరా పండుగ దోపిడీ ప్రారంభం అయ్యిందని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.నగరంలో నడిచే ఎర్రబస్సులకు స్పెషల్ బోర్డులు పెట్టి అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుతం స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఉప్పల్ నుంచి తొర్రూర్‌కు సూపర్ లగ్జరీ టికెట్ రూ.300 నుంచి రూ.430కు పెంచినట్టు తెలిసింది.
మహబూబ్‌నగర్ నుంచి ఎంజీబీఎస్‌కు రూ.220 ఉన్న టికెట్ రూ.290కు పైగా వసూలు చేస్తుండగా.. సాధారణంగా రూ.100 ఉన్న టికెట్ స్పెషల్ బస్సులో రూ.150 వరకు పెంచినట్టు సమాచారం. రూ.200 టికెట్‌కు బస్సును బట్టి రూ.300 నుంచి రూ.350 వరకు వసూళ్లు చేస్తున్నారని ప్రయాణికులు ఫైర్ అవుతున్నారు. సాధారణ బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ బస్సులను డిపోల్లో ఉంచి స్పెషల్ బస్సులను నడుపుతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకుపైగా ప్రత్యేక బస్సులు ఏర్పాట్టు చేసినట్టు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది.ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ సహా ప్రధాన బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉన్నట్టు తెలుస్తోంది.ప్రయాణికులకు సమాచారం అందించాల్సిన హెల్ప్‌లైన్ కేంద్రాల నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలాఉండగా, దసరా పండుగకు ముందస్తుగా ప్రకటించిన తేదీల్లోనే అదనపు చార్జీలు వసూలు చేస్తామని టీజీఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది.అక్టోబర్ 9, 10,16, 17 తేదీలు.. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 25, 26వ తేదీల్లో మాత్రమే అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు. మిగిలిన సాధారణ రోజుల్లో, రెగ్యులర్ బస్సు సర్వీసులలో ఎటువంటి అదనపు చార్జీలు ఉండవని స్పష్టంచేసింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది.


