Spirituality

Spirituality: మనిషి మరణించిన తర్వాత తల దగ్గర దీపం ఎందుకు పెడతారు?

రచన: Venu•••5 నిమిషాల పఠనం

మరణంతో స్థూల దేహం మాత్రమే విడిచిపోతుంది. జీవుడి తదుపరి గతి అతని కర్మలను అనుసరించి సాగుతుందని గరుడ పురాణం వివరిస్తుంది. ఈ ప్రయాణాన్ని ప్రేత ఖండంలో మహావిష్ణువు గరుత్మంతుడికి వివరించినట్లు పురాణ సంప్రదాయం చెబుతుంది.

మనిషి ప్రాణం విడిచిన తర్వాత ఇంట్లో ఒక దీపం వెలిగించడం... తరతరాలుగా వస్తున్న సనాతన సంప్రదాయం. చాలామందికి అది ఒక ఆచారంగా మాత్రమే తెలుసు. కానీ గరుడ పురాణంలో మరణానంతరం జీవుడి ప్రయాణాన్ని వర్ణించినప్పుడు... దీపానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం కనిపిస్తుంది.

మరణంతో స్థూల దేహం మాత్రమే విడిచిపోతుంది. జీవుడి తదుపరి గతి అతని కర్మలను అనుసరించి సాగుతుందని గరుడ పురాణం వివరిస్తుంది. ఈ ప్రయాణాన్ని ప్రేత ఖండంలో మహావిష్ణువు గరుత్మంతుడికి వివరించినట్లు పురాణ సంప్రదాయం చెబుతుంది.

మరణించిన జీవుడు యమమార్గంలో ప్రయాణించాల్సి ఉంటుందని... ఆ మార్గం సులభమైనది కాదని గరుడ పురాణం వర్ణిస్తుంది. చీకటి, భయానకమైన పరిస్థితులతో కూడిన ఆ మార్గంలో జీవుడికి ఉపశమనం కలిగించేందుకు మరణించినవారి పేరుతో అన్నదానం, జలదానం, వస్త్రదానం, పాదుకాదానం, దీపదానం వంటి అనేక ధర్మకార్యాలను సూచిస్తుంది.

అందులో దీపదానానికి ఉన్న విశిష్టత చాలా ప్రత్యేకమైనది. గరుడ పురాణంలోని ప్రేత ఖండంలోని ఒక వర్ణన ప్రకారం... మరణించిన జీవుడి ప్రయాణించే మార్గాన్ని ప్రకాశింపజేయడానికి మట్టి దీపాన్ని వెలిగించి, అది పగలు రాత్రి వెలుగుతూ ఉండేలా చేయాలని చెబుతుంది.

మరోవైపు మానవ శరీరంలో తల భాగం పరమ పవిత్రమైనది. అక్కడ సహస్రార చక్రం, బ్రహ్మరంధ్రం నెలకొని ఉంటాయి. దేహాన్ని వీడిన ఆత్మ భూమి వైపు, అజ్ఞానం వైపు ఆకర్షితం కాకుండా... ఉన్నతమైన ఊర్ధ్వ లోకాల వైపు, పవిత్రమైన చైతన్యం వైపు పయనించాలి. కాబట్టి తల వద్ద వెలిగే జ్యోతి ఆ ఆత్మకు మార్గాన్ని నిర్దేశిస్తుందని చెబుతారు.

ఇక స్థూల దేహాన్ని వదిలిన క్షణంలో ఆత్మ 'సూక్ష్మ శరీరాన్ని' పొందుతుంది. అప్పటివరకు తను జీవించిన ఇల్లు, మమకారాలు, అనుబంధాలను చూసి ఆత్మ తీవ్రమైన భయానికి, గందరగోళానికి గురవుతుంది. సకల లోకాలకు సాక్షి అయిన అగ్నిదేవుడు అక్కడ ప్రచండమైన రక్షణ కవచంగా నిలుస్తాడు. ఆత్మ చుట్టూ ఎలాంటి నకారాత్మక శక్తులు చేరకుండా ఈ దీపకాంతి అభయాన్ని ఇస్తుంది.

అలాగే దేహాన్ని వదిలి వెళ్తున్న ఆత్మకు ఆ అజ్ఞాత మార్గంలో దిక్కుతోచని స్థితి ఎదురైనప్పుడు... ఈ దీప కాంతి ఒక దివ్యమైన వెలుగు రేఖలా దారి చూపిస్తుందని మన పురాణాలు చెబుతాయి. అందుకే... ప్రాణం పోయిన మనిషి తల వద్ద నిరంతరం వెలిగే ఆ దీపం కేవలం ఒక ఆచారం కాదని, అది ఈ మృణ్మయ దేహాన్ని వీడి చిన్మయత్వంలోకి అడుగుపెడుతున్న జీవాత్మకు... మన సనాతన సంస్కృతి అత్యంత కరుణతో అందించే మహోన్నతమైన పరలోక వీడ్కోలని చెబుతారు.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#Lord Vishnu#Garuda Purannm#tradition#death#head#lamp
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి