తెలంగాణలో మరో కీలక ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సామ రామ్మోహన్‌రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సామ రామ్మోహన్‌రెడ్డి పోటీ చేయనున్నారు. నల్గొండ–ఖమ్మం–వరంగల్ నియోజకవర్గానికి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఖరారు చేసింది. వీరిద్దరి ఎంపికతో గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న కాంగ్రెస్‌లోని టికెట్ రేసుకు తెరపడింది.
మరోవైపు ఈ రెండు స్థానాల కోసం కాంగ్రెస్‌లో పలువురు నేతలు పోటీ పడ్డారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు పేర్లతో పీసీసీ అధిష్ఠానానికి జాబితా పంపగా.. చివరకు ఢిల్లీలో జరిగిన సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయం తీసుకున్నారు. నల్గొండ–ఖమ్మం–వరంగల్ స్థానానికి సర్వోత్తమ్‌రెడ్డి, పీవీ శ్రీనివాస్, చనగాని దయాకర్ పేర్లు పరిశీలనలో ఉండగా.. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానానికి సామ రామ్మోహన్‌రెడ్డి, మన్నె జీవన్‌రెడ్డి, గౌరీ సతీష్ పేర్లు ఉన్నాయి.
సామ రామ్మోహన్‌రెడ్డి గతంలో తెలంగాణ కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. పార్టీ తరఫున టీవీ చర్చల్లో పాల్గొంటూ కాంగ్రెస్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. మరోవైపు సర్వోత్తమ్‌రెడ్డి మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడు. దీంతో నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లోని ఆయన కుటుంబ రాజకీయ పరిచయాలు కూడా ఈ ఎంపికలో పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది.
ఇక ప్రస్తుతం మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ నియోజకవర్గానికి బీఆర్ఎస్‌కు చెందిన సురభి వాణీదేవి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. నల్గొండ–ఖమ్మం–వరంగల్ స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్నారు. కాగా ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. తుది ఓటర్ల జాబితాను డిసెంబర్ 30న ప్రకటించనున్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ మొదటి దశలోనే ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనతో రాజకీయంగా మాత్రం పోటీకి సిద్దమైంది. మరోవైపు రేవంత్ సర్కార్ తమ అభ్యర్థులను ముందుగానే రంగంలోకి దింపడం ద్వారా ప్రచారానికి సమయం తీసుకోవాలని చూస్తుండగా.. బీఆర్ఎస్, బీజేపీ కూడా పట్టభద్రుల ఓటర్లలో తమ బలాన్ని పెంచుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకునే అవకాశం ఉంది..


