మన సనాతన ధర్మం ఈ దేహం వెనుక ఉన్న ప్రాణశక్తిని, చైతన్యాన్ని, ఆత్మతత్త్వాన్ని గుర్తించమని చెబుతుంది. అందుకే మనిషి శరీరాన్ని సాధారణమైన భౌతిక రూపంగా కాకుండా, దైవతత్వాన్ని అనుభవించడానికి లభించిన పవిత్ర సాధనంగా సనాతన సంప్రదాయం భావించింది.
ఈ భావంతో మన శరీరాన్ని కూడా భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం ఒక పవిత్ర క్షేత్రంగా చూసింది. అందుకే "దేహో దేవాలయః ప్రోక్తః.. జీవో దేవః సనాతనః" అనే భావన కనిపిస్తుంది. అంటే ఈ దేహమే దేవాలయం... ఇందులో ఉన్న జీవచైతన్యమే సనాతనమైన దైవస్వరూపం.
మన శరీరాన్ని కేవలం మాంసం, ఎముకలు, రక్తంతో ఏర్పడిన రూపంగా మాత్రమే చూడకూడదు. మనలో ప్రాణం ఉంది, చైతన్యం ఉంది, ఆలోచన ఉంది, ఆత్మసాక్షాత్కారానికి అవకాశం ఉంది. అందుకే దేహాన్ని పవిత్రంగా కాపాడుకోవడం కూడా ఒక ఆధ్యాత్మిక బాధ్యతగా భావించారు.
ఇక గుడిలోకి వెళ్లే ముందు మనం చెప్పులు బయటే విడిచిపెడతాం. చేతులు కాళ్లు శుభ్రం చేసుకుంటాం. మనసును ప్రశాంతంగా ఉంచుతాం. అదే శ్రద్ధ మన దేహం విషయంలోనూ ఉండాలి. అపవిత్రమైన ఆలోచనలు, చెడు అలవాట్లు, అతి కోరికలు, ఇతరులకు హాని చేసే ప్రవర్తనతో ఈ దేవాలయాన్ని కలుషితం చేయకూడదనే సందేశం ఇందులో ఉంది.
యోగ సంప్రదాయం కూడా శరీరాన్ని ఆత్మసాధనకు సాధనంగా చూస్తుంది. "శరీరమాద్యం ఖలు ధర్మసాధనం" అనే భావం కూడా ఇదే విషయాన్ని గుర్తుచేస్తుంది. ధర్మాన్ని ఆచరించడానికి, సాధన చేయడానికి, భక్తిని అనుభవించడానికి ఈ శరీరమే మొదటి సాధనం.
అందుకే దేహాన్ని ప్రేమించడం అంటే కేవలం అందాన్ని కాపాడుకోవడం కాదు. ఆరోగ్యంగా ఉంచడం, సాత్వికమైన ఆహారం తీసుకోవడం, శుభ్రమైన జీవనాన్ని అలవర్చుకోవడం, మనసును పవిత్రంగా ఉంచడం. అందుకే దేహమేరా దేవాలయం... జీవమే అందులోని దైవం. అనే సత్యాన్ని గ్రహించినప్పుడు మన శరీరం పట్ల మన దృష్టి మారుతుంది. దేహాన్ని నిర్లక్ష్యం చేయకుండా, దాన్ని దైవసాధనకు ఉపయోగించడమే ఈ మాటలోని ఆధ్యాత్మిక సందేశంగా పండితులు పేర్కొంటారు..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.


