Sandhya Reddy: తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు. ఆస్ట్రేలియాలో అరుదైన ఘనత సాధించారు తెలంగాణకు చెందిన సంధ్యా రెడ్డి. ఆస్ట్రేలియాలో తొలి మహిళా మేయర్ గా ఆమె ఎన్నికయ్యారు. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం సిడ్నీ నగరంలోని స్ట్రాత్ ఫీల్డ్ (Strath Field) మేయర్ అయ్యారు. హైదరాబాద్ నగరంలో పుట్టి పెరిగారు సంధ్యా రెడ్డి. అనంతరం 2005లో లాయర్ గా ఆస్ట్రేలియా వెళ్ళారు. అక్కడే సెటిల్ అయ్యారు. ఆస్ట్రేలియాలోని స్ట్రాత్ ఫీల్డ్ లో ఆమె నివాసం ఉంటున్నారు.
ఖైరతాబాద్‌కు చెందిన శంకర్‌రెడ్డి, సరళా రెడ్డి దంపతుల కూతురు సంధ్యారెడ్డి హైదరాబాద్ స్టాన్లీ కాలేజీలో ఇంటర్ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి లా కోర్సు, పీజీ డిగ్రీ పూర్తి చేశారు. ఇమ్మిగ్రేషన్ లాయర్‌గా పనిచేశారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడే ఉన్నత విద్య కొనసాగించారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. ఆమె చేసిన సేవలకుగాను 2020లో స్ట్రాత్‌ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సంధ్యా రెడ్డి అందుకున్నారు.
సంధ్యా రెడ్డి స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా ఎన్నిక కావడం పట్ల స్థానికంగా ఉంటున్న తెలుగు వారు హర్షం వ్యక్తం చేశారు. వారంతా సంధ్యా రెడ్డిని అభినందించారు. ఇది తెలుగు రాష్ట్రాలకే గర్వకారణమన్నారు. ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళా శక్తిని చాటి చెప్పారంటూ సంధ్యా రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.


