ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. సూపర్ ఇంటెలిజెన్స్
ఇంటర్నెట్ రివల్యూషన్ కంటే AI పెద్దదన్న ట్రంప్
చైనా అధ్యక్షుడికి కూడా పేరు నచ్చిందన్న యూఎస్ ప్రెసిడెంట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రస్తుతం ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న టెక్నాలజీ. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ టెక్నాలజీకి ఉన్న పేరునే మార్చాలని అంటున్నారు. ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదానికి బదులుగా సూపర్ ఇంటెలిజెన్స్ అనే పేరును ఉపయోగించాలన్న తన ప్రతిపాదనపై ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. ఈ కొత్త పేరు అధికారికంగా అమెరికాలో ఉపయోగించేలా తాను త్వరలో ఒక శక్తివంతమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయబోతున్నట్లు కూడా ట్రంప్ చెప్పారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఈ విషయంపై తాను మాట్లాడానని, ఆయనకు కూడా ఈ పేరు నచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు.
‘ఆర్టిఫిషియల్’ అనే పదమే ఎందుకు?
AIకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు ఎందుకు పెట్టాలని ట్రంప్ ప్రశ్నించారు. ఇందులోని ఆర్టిఫిషియల్ అనే పదం తనకు నచ్చడం లేదని అన్నారు. ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమం అనే అర్థం వస్తుందని, కానీ ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఈ టెక్నాలజీ సామర్థ్యాన్ని కేవలం కృత్రిమ మేధస్సుగా పిలవడం సరైనది కాదన్నది ట్రంప్ వాదన.
ఇటీవల ఫేక్ న్యూస్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించిన ట్రంప్.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ అనే పదంపైనా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. AIకి సూపర్ ఇంటెలిజెన్స్, ఎక్స్‌ట్రీమ్ ఇంటెలిజెన్స్, సుపీరియర్ ఇంటెలిజెన్స్, సుప్రీమ్ ఇంటెలిజెన్స్ వంటి పదాలను ఉపయోగిస్తూ దాని సామర్థ్యాన్ని వివరించారు.
ఇంటర్నెట్ కంటే కూడా చాలా పెద్దదట!
AI భవిష్యత్తుపై ట్రంప్ చేసిన మరో వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇంటర్నెట్ కంటే మాత్రమే కాదు, ఇండస్ట్రియల్ రివల్యూషన్ కంటే కూడా చాలా పెద్ద మార్పును తీసుకురాగలదని ఆయన అన్నారు. ఇంటర్నెట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సమాచార వ్యవస్థ, కమ్యూనికేషన్ విధానాలను మార్చేసినట్లే.. AI మరింత విస్తృతమైన ప్రభావాన్ని చూపుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
అయితే ఇదే సమయంలో AIపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. AI కంపెనీలకు చెందిన ప్రముఖులు సైతం ఈ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఎదురయ్యే ప్రమాదాలపై హెచ్చరికలు చేస్తున్నారు. ముఖ్యంగా OpenAI సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ వంటి టెక్ రంగ ప్రముఖులు AI భవిష్యత్ ప్రభావాలపై పలు సందర్భాల్లో మాట్లాడారు.
ప్రభుత్వ సేవల కోసం కొత్త AI వెబ్‌సైట్
ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలోనే అమెరికా ప్రభుత్వం మరో కీలక AI ప్రాజెక్టును ప్రారంభించింది. America.govను అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి ఒక ప్రధాన డిజిటల్ గేట్‌వేగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి వేలాది ప్రభుత్వ వెబ్‌సైట్లను వెతకాల్సిన పరిస్థితి ఉంది. కొత్త AI ఆధారిత వ్యవస్థ ద్వారా ప్రజలు సాధారణ భాషలో ప్రశ్న అడిగితే.. అవసరమైన ప్రభుత్వ సమాచారాన్ని ఒకే చోట పొందేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు.
అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన సుమారు 29 వేలకుపైగా వెబ్‌సైట్లలో సమాచారాన్ని వెతకాల్సిన అవసరం తగ్గేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం.
అన్ని ప్రభుత్వ ఏజెన్సీలకు అనుసంధానం
కొత్త AI ఆధారిత ప్రభుత్వ వెబ్‌సైట్‌తో అన్ని ఫెడరల్ ప్రభుత్వ ఏజెన్సీల ప్రజలకు కనిపించే వ్యవస్థలను అనుసంధానం చేయాలని ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు ఎయిర్ bnb సహ వ్యవస్థాపకుడు జో గెబ్బియా అమెరికా ప్రభుత్వ చీఫ్ డిజైన్ ఆఫీసర్‌గా నాయకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్‌సైట్ అభివృద్ధిలో గూగుల్ జెమిని, స్పెస్ Xకు చెందిన గ్రోక్ వంటి AI టెక్నాలజీల సహాయం తీసుకున్నట్లు గెబ్బియా వెల్లడించారు.
అంటే.. AIని కేవలం ఒక కొత్త టెక్నాలజీగా చూడకుండా, ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే విధానంలో కూడా కీలక భాగంగా మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.
పేరు మారుతుందా? టెక్నాలజీ దిశ మారుతుందా?
ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సూపర్ ఇంటెలిజెన్స్ అనే పేరు పెట్టాలని చెబుతున్నప్పటికీ.. అసలు ఆసక్తి మాత్రం పేరు మార్పు కంటే AIపై అమెరికా తీసుకోబోయే తదుపరి నిర్ణయాలపైనే ఉంది. ఒకవైపు AI అభివృద్ధిని వేగంగా కొనసాగించాలని అమెరికా ప్రయత్నిస్తుంటే.. మరోవైపు దాని వల్ల వచ్చే ఆర్థిక, సామాజిక, భద్రతా ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన ఇంటర్నెట్ కంటే చాలా పెద్దది అనే వ్యాఖ్యలు AI భవిష్యత్తుపై అమెరికా అధ్యక్షుడి దృక్పథాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు నిజంగా సూపర్ ఇంటెలిజెన్స్ గా మారుతుందా? ట్రంప్ చెప్పినట్లు AI ప్రపంచాన్ని ఇంటర్నెట్ కంటే కూడా పెద్ద స్థాయిలో మార్చగలదా? అనేది రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనుంది.


