Health

Health: పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్‌.. ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!..

రచన: Venu•••5 నిమిషాల పఠనం

తలనొప్పి వచ్చింది.. ఒళ్లు నొప్పిగా ఉందని తరచుగా పెయిన్ కిల్లర్ వేసుకోవడం. జలుబు, గొంతునొప్పి వచ్చిందంటే డాక్టర్‌ను సంప్రదించకుండానే యాంటీబయాటిక్ మొదలుపెట్టడం. చాలమందిలో సాధారణంగా కనిపించే ఈ అలవాటు..

తలనొప్పి వచ్చింది.. ఒళ్లు నొప్పిగా ఉందని తరచుగా పెయిన్ కిల్లర్ వేసుకోవడం. జలుబు, గొంతునొప్పి వచ్చిందంటే డాక్టర్‌ను సంప్రదించకుండానే యాంటీబయాటిక్ మొదలుపెట్టడం. చాలమందిలో సాధారణంగా కనిపించే ఈ అలవాట్లపై కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ CDSCO హెచ్చరిక జారీ చేసింది.

పెయిన్ కిల్లర్లు, ముఖ్యంగా NSAIDsను అవసరం లేకుండా పదేపదే లేదా ఎక్కువకాలం తీసుకోవడం ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని CDSCO స్పష్టం చేసింది. ఈ మందుల్లో కొన్ని కిడ్నీలకు వెళ్లే రక్తప్రవాహాన్ని తగ్గించగలవు. దీంతో కిడ్నీల పనితీరుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు, డీహైడ్రేషన్‌తో ఉన్నవారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు లేదా కిడ్నీలను ప్రభావితం చేసే ఇతర మందులు వాడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

అందుకే నొప్పి, వాపు లేదా జ్వరానికి పెయిన్ కిల్లర్ అవసరమైనప్పుడు వైద్యుల సూచనతోనే తీసుకోవాలని, సరైన మోతాదులో, అవసరమైనంత కాలం మాత్రమే వాడాలని CDSCO సూచించింది. ప్రతి ఒక్కరికీ ఒకే మందు, ఒకే మోతాదు సరిపోదని.. వయసు, ఇతర అనారోగ్య సమస్యలు, ప్రస్తుతం వాడుతున్న మందులు, కిడ్నీల పరిస్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

ఇక యాంటీబయాటిక్స్ విషయంలోనూ ఇదే జాగ్రత్త అవసరం. జలుబు, గొంతునొప్పి, సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పనిచేయకపోవచ్చు. అయినా వాటిని సొంతంగా తీసుకోవడం వల్ల బ్యాక్టీరియాలో మందులను తట్టుకునే సామర్థ్యం పెరగవచ్చు. దీనినే యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్.. అంటే AMR అంటారు. భవిష్యత్తులో సాధారణ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు సైతం ఈ మందులు సరిగా పనిచేయని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

అందుకే డాక్టర్ సూచించినప్పుడే యాంటీబయాటిక్ తీసుకోవాలని, అలాగే వాళ్ళు చెప్పిన మోతాదు పాటించాలని CDSCO స్పష్టం చేసింది. మిగిలిపోయిన యాంటీబయాటిక్స్‌ను మరోసారి సొంతంగా వాడటం లేదా ఇతరులకు ఇవ్వడం కూడా చేయకూడదని సూచించింది.

అంతేకాదు.. NSAIDs, యాంటీబయాటిక్స్ వంటి మందులను నిబంధనలకు విరుద్ధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించకూడదని ఫార్మసీలు, రిటైలర్లకు కూడా స్పష్టం చేసింది. చాలా NSAIDs Schedule H కింద, చాలా యాంటీబయాటిక్స్ Schedule H1 కింద ఉండటంతో, వీటి విక్రయానికి వైద్యుడి ప్రిస్క్రిప్షన్ అవసరమని CDSCO సూచించింది.

కాబట్టి నొప్పి తగ్గిందని ప్రతి సారి పెయిన్ కిల్లర్, ఇన్ఫెక్షన్ వచ్చిందని ప్రతి సారి యాంటీబయాటిక్ తీసుకోవడం కాకుండా.. అవసరమైన మందు, సరైన మోతాదు, సరైన వ్యవధి అనే నియమాన్ని పాటించాల్సిన అవసరాన్ని CDSCO మరోసారి స్పష్టం చేసింది.

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#painkillers#antibiotics#NSAIDs#CDSCO#Pain#swelling#fever
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి