మరికొద్ది గంటల్లో ఇండి కూటమి పవర్ షో
ఢిల్లీ వేదికగా మెగా మీటింగ్
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామానే ఎజెండా
ఒక్కతాటిపైకి విపక్షాలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మొదలై విపక్షాల ఉమ్మడి రాజకీయ అంశంగా మారుతోంది. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణపై ఇప్పటికే తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విపక్షాలు.. ఇప్పుడు నేరుగా సీఈసీనే టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత ఈ పోరాటం మరింత తీవ్ర రూపం దాల్చింది.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. అలాగే ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను పునరుద్ధరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ అంశంపై ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని కూడా నిర్ణయించింది.
కాంగ్రెస్ నుంచి INDIA కూటమి దిశగా
ఇప్పటివరకు సీఈసీపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటం.. ఇప్పుడు కూటమి స్థాయికి వెళ్లబోతోంది. మరికొద్ది గంటల్లో ఢిల్లీలో INDIA కూటమి కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఎన్నికల సంఘంపై వచ్చిన వివాదం, ఎస్‌ఐఆర్‌పై ఉన్న అభ్యంతరాలు, సీఈసీ రాజీనామా డిమాండ్‌తో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరగనుంది.
ఇప్పటికే INDIA కూటమిలోని పలు పార్టీల నేతలు సీఈసీ తొలగింపుపై తమ వైఖరిని వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సీఈసీపై తీవ్ర విమర్శలు చేశారు.
ఒకే అంశం.. విభిన్న పార్టీలను కలుపుతోందా?
ఇదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరమైన అంశం. INDIA కూటమిలో పార్టీల మధ్య చాలా విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా రాజకీయ ప్రయోజనాలు వేరు. కొన్ని చోట్ల ఒకరిపై ఒకరు పోటీ చేసే పరిస్థితి కూడా ఉంది. కానీ ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు, ఓటర్ల జాబితా సవరణ, సీఈసీపై వచ్చిన ఆరోపణలు మాత్రం విపక్ష పార్టీలను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నాయి.
కాంగ్రెస్ దీన్ని ప్రజాస్వామ్యం, ఓటు హక్కు, ఎన్నికల పారదర్శకతకు సంబంధించిన అంశంగా చూపిస్తోంది. ఇతర విపక్ష పార్టీలు కూడా ఎన్నికల ప్రక్రియపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. అందుకే సీఈసీ అంశం ఇప్పుడు కేవలం కాంగ్రెస్ వర్సెస్ ఎన్నికల సంఘం వ్యవహారంగా కాకుండా.. విపక్షాల ఉమ్మడి రాజకీయ అంశంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇండి కూటమి భేటీలో ఏం తేలనుంది?
INDIA కూటమి సమావేశం ఈ విషయంలో కీలకం కానుంది. కేవలం సీఈసీ రాజీనామా డిమాండ్ చేయడమే కాకుండా.. ఈ అంశంపై ఉమ్మడి ఆందోళన చేపట్టాలా? పార్లమెంట్‌లో ఏ విధమైన వ్యూహాన్ని అనుసరించాలి? దేశవ్యాప్తంగా ఉమ్మడి నిరసనలు నిర్వహించాలా? వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
అంతేకాదు, సీఈసీని పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో పార్లమెంట్‌లో కొత్తగా చర్యలు చేపట్టే అంశం కూడా చర్చలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే ఢిల్లీ సమావేశం తర్వాత ఈ పోరాటం ఏ రూపం దాల్చుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సీఈసీ వ్యతిరేక ఉద్యమం.. విపక్షాల ఐక్యతకు కొత్త పరీక్ష
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావడం అంత సులభంగా జరగలేదు. కానీ ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన ఈ వివాదం మాత్రం వేర్వేరు పార్టీలను ఒకే అంశంపై మాట్లాడేలా చేస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది. కొద్ది గంటల్లో INDIA కూటమి సమావేశమవుతోంది. టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన ఉద్ధవ్ వర్గం, వామపక్షాలు సహా వివిధ విపక్ష పార్టీల నేతలు ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉంది.
అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న సీఈసీ రాజీనామా చేస్తారా లేదా అన్నదొక్కటే కాదు. సీఈసీపై మొదలైన పోరాటం.. విభిన్న రాజకీయ సిద్ధాంతాలు, విభిన్న రాష్ట్ర రాజకీయాలు ఉన్న విపక్షాలను ఎంతవరకు ఒకే వేదికపై నిలబెడుతుంది? INDIA కూటమి సమావేశం దీనికి ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వొచ్చు.
ఎన్నికల సంఘంపై పోరాటం.. ఇప్పుడు క్రమంగా విపక్షాల ఉమ్మడి రాజకీయ పోరాటంగా మారుతున్న దృశ్యం కనిపిస్తోంది. ఇండి కూటమి సమావేశంలో ఉమ్మడి కార్యాచరణ ఖరారైతే.. ఈ వివాదం మరింత పెద్ద రాజకీయ ఉద్యమంగా మారే అవకాశం ఉంటుంది.


