తెలంగాణ

Telangana: ACBకి షాక్‌.. ప్రాసిక్యూషన్‌ అనుమతి లేక 20 కేసులు క్లోజ్‌!!

రచన: Venu••7 నిమిషాల పఠనం

ప్రభుత్వ నిర్ణయం మేరకు 2006 ఫిబ్రవరి 13న ACB డీజీ.. సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు ముందుంచి ఎఫ్‌ఐఆర్‌ మూసివేతకు అనుమతి కోరాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారు.

అవినీతి నిరోధక శాఖ (ACB) నమోదు చేసిన కేసుల్లో కనీసం 20 ఎఫ్‌ఐఆర్‌లు మూసివేయబడ్డాయి. 2021 నుంచి నమోదైన ఈ కేసుల్లో నిందితులపై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో.. క్రిమినల్‌ విచారణకు బదులుగా శాఖాపరమైన చర్యలు, విచారణలు, దర్యాప్తులకు సంబంధిత విభాగాలు మొగ్గుచూపినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. మూసివేసిన కేసుల్లో కనీసం ఐదు లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులు ఉండటం గమనార్హం.

ఈ వ్యవహారంలో మహబూబ్‌నగర్‌ మాజీ మున్సిపల్‌ కమిషనర్‌ వడ్డే సురేందర్‌కు సంబంధించిన కేసు ఒకటి. 2000 అక్టోబర్‌ 22న రూ.1.65 లక్షల లంచం తీసుకుంటున్న సమయంలో ACB అధికారులు సురేందర్‌ను పట్టుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. క్లోరినేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించిన పనుల కోసం జిల్లా కలెక్టర్‌కు కొటేషన్లు పంపి, వర్క్‌ ఆర్డర్‌ జారీ చేయించే విషయంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఆయనను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

దర్యాప్తు పూర్తయిన అనంతరం 2021-22లో ACB డీజీ.. అవినీతి నిరోధక చట్టం కింద సురేందర్‌పై ప్రాసిక్యూషన్‌ చేపట్టాలని సిఫారసు చేస్తూ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ 2005 ఫిబ్రవరి 27న ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్‌ 12న ఈ నిర్ణయాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తూ ACBకి ఆదేశాలు జారీ చేసినట్లు రికార్డుల్లో ఉంది.

ప్రభుత్వ నిర్ణయం మేరకు 2006 ఫిబ్రవరి 13న ACB డీజీ.. సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు ముందుంచి ఎఫ్‌ఐఆర్‌ మూసివేతకు అనుమతి కోరాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారు. అనంతరం హైదరాబాద్‌లోని ACB ప్రత్యేక కోర్టు తుది నివేదికను అంగీకరించి సురేందర్‌పై నమోదైన కేసును మూసివేసింది.

ఇది ఒక్క కేసుకే పరిమితం కాలేదు. G. ప్రభాకర్‌రావు అనే లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, M. సతీష్‌కుమార్‌ అనే జూనియర్‌ లైన్‌మ్యాన్‌, N. లవ్‌కుమార్‌, సూర్యాపేట మాజీ రూరల్‌ స్టేషన్‌కు చెందిన చరణ్‌సింగ్‌, TGSPDCL అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ G. సైదులు, మాజీ వెల్దండ తహసీల్దార్‌ తదితరులపై నమోదైన లంచం కేసుల్లోనూ ఇదే తరహా పరిణామాలు చోటుచేసుకున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.

2025 జూలై నుంచి 2026 జనవరి మధ్య ఈ కేసుల్లో కొన్నింటిని మూసివేయగా.. సంబంధిత శాఖలు ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వకుండా శాఖాపరమైన చర్యలు, విచారణలు లేదా కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌క్వైరీస్‌ ద్వారా దర్యాప్తు వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

లంచం కేసులతో పాటు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు కూడా ఇదే తరహాలో ముగిశాయి. మాజీ HMDA డైరెక్టర్‌ (ప్లానింగ్‌) K.పురుషోత్తమ్‌రెడ్డిపై 2018లో ACB ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఆయన పేరుతో కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ACB పేర్కొంది. 2018 ఫిబ్రవరిలో ఆయనను అరెస్టు చేశారు.

అయితే 2025లో ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు సిఫారసు చేయడంతో.. దర్యాప్తు అధికారి ఎఫ్‌ఐఆర్‌ మూసివేతకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ACB ప్రత్యేక కోర్టు 2025 నవంబర్‌ 11న క్లోజర్‌ రిపోర్టును అంగీకరించింది. మాజీ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (IMS) జాయింట్‌ డైరెక్టర్‌ K.పద్మ, ACP Y.నరసింహారెడ్డి, పంచాయతీరాజ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ B.సుదర్శన్‌రెడ్డిలపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు కూడా ఇలాంటి కారణాలతోనే మూసివేయబడినట్లు సమాచారం.

ఇక HMDAలో పనిచేసిన ఓ DSPతో పాటు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై 2021, 2023లో నమోదైన లంచం కేసులు కూడా 2024, 2025లో మూసివేశారు. సంబంధిత శాఖలు క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు బదులుగా శాఖాపరమైన చర్యలకు మొగ్గు చూపిన నేపథ్యంలో ఈ కేసులు క్లోజ్‌ అయినట్లు రికార్డులు సూచిస్తున్నాయి.

మరోవైపు ACBలోని ఓ అధికారి ఈ పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.. ఇక ట్రాప్‌ కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేయడానికి అధికారులు పెద్దఎత్తున ఆధారాలు సేకరించి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత కూడా.. ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌కు బదులుగా శాఖాపరమైన చర్యలను ఎంచుకోవడం క్షేత్రస్థాయి సిబ్బందికి నిరుత్సాహాన్ని కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా ఈ వ్యవహారంపై వివరణ కోరగా మరో సీనియర్‌ ACB అధికారి స్పందించేందుకు నిరాకరించినట్లు సమాచారం..

#Telangana#Hyderabad#ACB 20 ​​cases#closed#prosecution sanction#HMDA#DSP#TGSPDCL
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి