తెలంగాణ

Suryapet: ముదిరిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల వివాదం.. లబ్ధిదారుల ఎంపికపై గ్రామస్తుల ఆగ్రహం!!..

రచన: Venu•••4 నిమిషాల పఠనం

మద్దిరాల గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన 58 డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల కోసం రెండేళ్ల క్రితం దరఖాస్తులు స్వీకరించారు. ఈ ఇళ్ల కోసం 500 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. 300 మందికి పైగా అర్హులుగా గుర్తించినట్లు సమాచారం.

సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామంలో డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల కేటాయింపు కోసం చేపట్టిన డ్రా ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. 58 ఇళ్లను లబ్ధిదారులకు డ్రా పద్ధతిలో కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా.. అర్హుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

మద్దిరాల గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన 58 డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల కోసం రెండేళ్ల క్రితం దరఖాస్తులు స్వీకరించారు. ఈ ఇళ్ల కోసం 500 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. 300 మందికి పైగా అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రెండేళ్లుగా పెండింగ్‌లో ఉండటంతో.. ఈలోగా కొంతమంది దరఖాస్తుదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి.

అయితే ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు పొందిన కొంతమందిని డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల డ్రాలో కూడా చేర్చడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి రెండు వేర్వేరు ప్రభుత్వ గృహ పథకాల ప్రయోజనాలు ఎలా వస్తాయన్నది వారి ప్రధాన ప్రశ్నగా మారింది.

వాస్తవానికి తెలంగాణ డబుల్‌ బెడ్రూమ్‌ హౌసింగ్‌ పథకం మార్గదర్శకాల ప్రకారం.. ఇళ్లు లేని పేద కుటుంబాలకు ఉచితంగా 2BHK ఇళ్లు అందించడమే లక్ష్యం. లబ్ధిదారుల అర్హతను అధికారులు పరిశీలించడంతో పాటు, ఎంపికైన జాబితాను గ్రామసభ లేదా వార్డు సభ ముందు ఉంచి ధృవీకరించాల్సి ఉంది.

ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకంలోనూ అర్హత పరిశీలన తర్వాతే లబ్ధిదారులను ఖరారు చేసే విధానం ఉంది. దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌, గ్రామసభ ఆమోదం వంటి ప్రక్రియలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.

ఈ నేపథ్యంలో మద్దిరాలలో ఇప్పటికే మరో గృహ పథకం కింద లబ్ధి పొందిన వారి పేర్లు డబుల్‌ బెడ్రూమ్‌ డ్రాలో ఉన్నాయన్న ఆరోపణలు మరింత వివాదానికి దారితీశాయి. ఇక ఈ ఆందోళన సమయంలో ఓ మహిళ పెట్రోల్‌ బాటిల్‌తో రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టడంతో పాటు కొందరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అయితే డ్రా నిర్వహించడం కంటే ముందు అర్హుల జాబితాను మరోసారి పూర్తిస్థాయిలో పరిశీలించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఇల్లు పొందినవారిని తొలగించి.. నిజంగా ఇల్లు లేని అర్హులైన కుటుంబాలను గుర్తించి డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు కేటాయించాలని కోరుతున్నారు.

#Suryapet#Maddirala#Double-bedroom#house allotment#draw process
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి