తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలకమైన, ఉద్వేగభరితమైన ఘట్టం 'సాగరహారం'(తెలంగాణ మార్చ్). ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ మహా ప్రదర్శనను చేపట్టారు. ఈ కార్యక్రమం జరిగి నేటితో 14 సంవత్సరాలు పూర్తయింది. ఇది 2012 సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్), నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో పెద్దఎత్తున నిర్వహించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల వివక్షకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను దేశవ్యాప్తంగా చాటిచెప్పడానికి దీనిని చేపట్టారు. తెలంగాణ ఇస్తేనే ఇక్కడి ప్రజల బతుకులు మారుతాయని, కేంద్రంలోని యూపీఏ (UPA) ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జేఏసీ (JAC) ఆధ్వర్యంలో ఈ పిలుపునిచ్చారు. అప్పటికే 'మిలియన్ మార్చ్' వంటి పెద్ద ఉద్యమాలు జరిగినా కేంద్రం స్పందించకపోవడంతో, అంతకంటే పెద్ద ఎత్తున ప్రజా శక్తిని చూపించాలని నాటి ఉద్యమనేత కేసీఆర్, మరికొందరి ఆధ్వర్యంలో సాగరహారానికి పిలుపునిచ్చారు.
తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు (విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కార్మికులు, రాజకీయ నాయకులు) ఒకే తాటిపై ఉన్నారని నిరూపించడానికి సాగరహారం ఒకవేదికైంది.అప్పటి ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిభద్రతల నెపంతో తెలంగాణ ఉద్యమకారులను అణచివేయాలని చూడగా, ఆ ఆంక్షలన్నింటినీ ఛేదించి తమ హక్కును సాధించుకుంటామని చాటిచెప్పేందుకు దీనిని ఓ బృహత్తరకార్యక్రమంగా చేపట్టారు. తెలంగాణలోని 10 జిల్లాల నుంచి లక్షలాది మంది ప్రజలు హైదరాబాద్‌కు తరలివచ్చారు.
రైళ్లు రద్దు చేసినా, బస్సులు ఆపేసినా, రోడ్లపై ముళ్లకంచెలు వేసినా అన్ని అడ్డంకులను దాటుకుని హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకుని తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని పోరాటం చేశారు.పోలీసులు బారీకేడ్లు, ముళ్లకంచెలు వేసి అడ్డుకున్నా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి ఎదురుతిరిగారు.ఈ క్రమంలోనే నాటి సాగరహారాన్ని గుర్తుచేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు.
‘తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన పోరాట రూపం సాగరహారం. ఆంక్షలను, నిర్బంధాలను, ముళ్లకంచెలను, లాఠీచార్జీలను, రబ్బర్ బుల్లెట్లను లెక్క చేయకుండా... ఉమ్మడి పాలకుల కుట్రలను తిప్పికొడుతూ... ఉద్యమకారులు, తెలంగాణవాదులు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన చారిత్రక ఘట్టం సెప్టెంబర్ 30, 2012 నాటి సాగరహారం. సబ్బండ వర్గాలు హుస్సేన్ సాగర్ తీరాన చేసిన చారిత్రాత్మక సాగరహారానికి 14 ఏళ్లు నిండిన సందర్భంగా... తెలంగాణ ప్రజలకు ఉద్యమాభివందనాలు’ అని రాసుకొచ్చారు.


